బిజెపికి సిద్దరామయ్య కౌంటర్
బెంగళూరు: హిందూత్వ సిద్ధాంతానికి, హిందూ విశ్వాసానికి మధ్య తేడాను కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివరించడం వివాదాస్పదమైంది. బెంగళూరులో గురువారం ఒక కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మైనారిటీలకు దూరం కాకుండా తటస్థ హిందువులను ఆకట్టుకునేందుకు ఉపయోగించే మెతక హిందూత్వ వైఖరి గురించి ప్రస్తావించారు. అసలు మెతక హిందూత్వ, కరడుగట్టిన హిందూత్వ అంటే ఏమిటని సిద్దరామయ్య ఈ సందర్భంగా ప్రశ్నించారు. హిందూత్వ అంటే హిందూత్వనేనని ఆయన స్పష్టం చేశారు.
తాను హిందువునని, హిందూత్వ వేరు..హిందువు వేరని ఆయన చెప్పారు. తాము రాముడిని పూజించమా, వారు(బిజెపి) మాత్రమే పూజిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం రామాలయాలు కట్టలేదా&రామ కీర్తనలు పాడలేదా అంటూ ఆయన బిజెపి నాయకులను ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో హిందువులు భజనలు పాడుతారని, తన గ్రామంలో తాను కూడా సంకీర్తనలలో పాల్గొనేవాడినని సిద్దరామయ్య తెలిపారు. వాళ్లు మాత్రమే హిందువులా..తాము కామా అంటూ ఆయన బిజెపి నాయకులను ఉద్దేశించి నిలదీశారు.
కాగా..సిద్దరామయ్య వ్యాఖ్యలపై బిజెపి నాయకుడు సిఎన్ అశ్వద్ధ నారాయణ స్పందించారు. సిద్దరామయ్యకు కాని, కాంగ్రెస్ పార్టీకి కాని భారత్ లేదా హిందూత్వ పట్ల ఏమాత్రం స్పష్టత లేదని ఆయన విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలు తప్ప వారికి ఏమీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతుంటుందని, చట్టాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. హిందూత్వ గురించి మాట్లాడే నైతిక హక్కు సిద్దరామయ్యకు లేదని ఆయన అన్నారు.