న్యూఢిల్లీ :దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఖాతాలను రూపొందించారు. ఆరోగ్య చైతన్య ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ అకౌంట్ల ఏర్పాటు జరిగింది. దీని వల్ల ప్రతికుటుంబానికి ఏడాది రూ 5 లక్షల మేర అధీకృత ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందించేందుకు వీలేర్పడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయుష్మాన్ భవ కార్యక్రమం సాగుతోంది. ప్రజలకు వారి ఆరోగ్య పరిరక్షణ పట్ల సరైన ఆలోచన కల్పిండడం, అవసరార్థులకు చికిత్సలు నిర్వహించడం ఈ పథకం లక్షంగా ఉంది. ఈ పరిధిలో ఐదుకోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల (ఎబిహెచ్‌ఎ) సౌకర్యం కల్పించారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 వరకూ ఈ ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా మేళాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ దాదాపు 14 లక్షల మేళాలలో దాదాపు 11 కోట్ల మంది వరకూ అధికారులు వెళ్లారు. ఈ దశలో దాదాపు 50 వేల మంది గర్భిణులు ఆ పథకం పరిధిలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 75 లక్షల మందివరకూ ఆయుషు సేవల విషయంలో సమాచారం అందుకున్నారు. ఇక జీవన శైలి కార్యకలాపాల సంబంధిత విషయాలలో దాదాపు 11 కోట్ల మంది వరకూ తగు సూచనలు సలహాలు స్వీకరించారని ప్రకటనలో తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే టిబి, హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ , కాటారాక్ట్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.