గువాహటి: తన సోషల్ మీడియా వేదికలపై కులతత్వ వ్యాఖ్యలు చేసే పోస్టును అప్‌లోడ్ చేసినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు చెప్పారు. భగవద్ గీతలోని శ్లోకాన్ని తన బృందం తప్పుగా అనువదించిందని ఆయన వివరణ ఇచ్చారు. గురువారం రాత్రి సామాజిక మాధ్యమాలైన ఎక్స్(పూర్వ ట్విట్టర్), ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్టులో తాను ప్రతి రోజు ఉదయం భగవద్ గీతలోని ఒక శ్లోకాన్ని అప్‌లోడ్ చేస్తున్నానని, ఇప్పటివరకు 668 శ్లోకాలు అప్‌లోడ్ చేశానని శర్మ రాశారు. ఇటీవల తన బృందం సభ్యులలో ఒకరు భగవద్ గీతలోని 18వ అధ్యాయంలోని 44వ శ్లోకాన్ని తప్పుగా అనువదించి పోస్టు చేశారని ఆయన తెలిపారు. ఆ పొరపాటును గుర్తించిన తాను వెంటనే ఆ పోస్టును తొలగించానని శర్మ తెలిపారు. తొలగించిన ఆ పోస్టు ఎవరి బనోభావాలనైనా గాయపరిస్తే తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ 26న గీతలోని 18వ అధ్యాయమైన సన్యాస యోగకు చెందిన 44వ శ్లోకాన్ని తన సామాజిక మాధ్యమాల వేదికలలో ఆడియో వీడియో రూపంలో ఒక పోస్టును శర్మ అప్‌లోడ్ చేశారు. అందులో ఇలా వ్యాఖ్యానించారు. వ్యవసాయం, గోవుల పెంపకం, వర్తకం వంటివి వైశ్యులకు సహజసిద్ధమైన విధులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి మూడు వర్ణాలకు సేవ చేయడం శూద్రుల సహజ విధి అంటూ ఆ పోస్టులో వ్యాఖ్యానించారు. అంతేగాక శ్రీ కృష్ణ భగవానుడే స్వయంగా వైశ్యులు, శూద్రుల సహజ విధులను వర్ణించాడు అని కూడా శర్మ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇది బిజెపి మనువాద, తిరోగమన సిద్ధాంతాలంటూ ప్రతిపక్షాలకు చెందిన నాయకులు శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోస్టుకు తీవ్ర విమర్శలు ఎదురవ్వడంతో ఆ పోస్టును అన్ని సోషల్ మీడియా వైదికల నుంచి తొలగించారు.