జిహెచ్‌ఎంసితో కలిసి పట్టణ ప్రాంతాల్లో 4,89,000 అప్లికేషన్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862
ప్రజాపాలనకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండవ రోజు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 8,12,862 దరఖాస్తులు అందాయని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఈ దరఖాస్తులలో పట్టణ ప్రాంతాలలో జిహెచ్‌ఎంసితో కలిపి 4,89,000 దరఖాస్తులు అందాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి 3,23,862 దరఖాస్తులుఅందాయన్నారు. ప్రభు త్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండో రోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు.
ప్రజా పాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఏర్పా ట్లు చేయాలని, అభయ హస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలాకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
పురుషులకు, మహిళలకు వేరు వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా షామియానా, బారికేడింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా తయారు చేసిన గ్రామ సభల షెడ్యూల్ ను ప్రెస్, మీడియా లో విస్తృతంగా ప్రచారం చేసెందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేవిధంగా జిల్లా అధికారులందరు కృషి చేయాలన్నారు.