జొమాటో అధీనంలో నడుస్తున్న క్విక్ డెలివరీ ప్లాట్ ఫారమ్.. బ్లింకిట్ కొన్ని సరదా విషయాలను బయటపెట్టింది. వినియోగదారులు కోరుకున్నదే తడవు నిమిషాల వ్యవధిలో ఆయా వస్తువులను ఇంటి ముంగిటికి తెచ్చి అందించే బ్లింకిట్.. 2023లో తాము సరఫరా చేసిన కొన్ని రకాల వస్తువుల వివరాలను వెల్లడించింది.
ఈ ఏడాది దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు 9940 కండోమ్ లు ఆర్డర్ చేశాడట. అలాగే బ్లింకిట్ వివిధ వినియోగదారులకు 30,02,080 పార్టీ స్మార్ట్ టాబ్లెట్లను సరఫరా చేసింది. రాత్రి మందు కొట్టాక, పొద్దున హ్యాంగోవర్ ఉండకుండా ఈ టాబ్లెట్లను వాడతారు. గురుగ్రామ్ లో వినియోగదారులకు ఈ ఏడాది 65,973 లైటర్లను బ్లింకిట్ అందజేసింది.
బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు 1,59,900 రూపాయల విలువ చేసే ఐఫోన్ 15 ప్రో మాక్స్ తోపాటుగా ఒక లే చిప్స్ ప్యాకెట్ నూ, ఆరు అరటిపళ్లనూ ఆర్డర్ చేశాడట. ఇక ఈ ఏడాది పొడవునా అర్థరాత్రి దాటాక తాము 3,20,04, 725 మ్యాగీ ప్యాకెట్లను సరఫరా చేసినట్లు బ్లింకిట్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి 2023లో పలు దఫాలుగా 17,009 కేజీల బియ్యాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడట. అలాగే ఒక వ్యక్తి ఒకే నెలలో 38 అండర్ వేర్లను బ్లింకిట్ ద్వారా తెప్పించుకోగా, మరొకరు 972 మొబైల్ చార్జర్లను ఆర్డర్ చేశాడట.