పాత లబ్ధిదారులకు యథావిధిగా రైతుబంధు, పింఛన్లు
ఇప్పటివరకు రానివారే దరఖాస్తు చేసుకోవాలి
ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలి
సమీక్షా సమావేశంలో సిఎం రేవంత్
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను సిఎం ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులకు యధావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు.
ఆరు గ్యారంటీలు అర్హులైన అందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని సిఎం సూచించారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సిఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సిఎం సూచించారు. ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని, రెండు రోజులుగా సుమారు పదిహేనున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. సమీక్ష అనంతరం సిఎం రేవంత్‌రెడ్డిని, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగంలు కలిశారు.