కలిసి జామ్ తయారు చేసిన తల్లీ కొడుకులు
మధ్య మధ్య జోకులతో వీడియో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా తిరిగి వచ్చిన వెంటనే ఆమె వండే వంటకం ఒకటి ఉంది. అదే అర్హర్ కీ దాల్, చావల్. కొత్త సంవత్సరం సందర్భంగా తన కుమారుడు రాహుల్ గాంధీ యూ ట్యూబ్ చానల్‌లో విడుదల చేసిన వీడియోలో సోనియా గాంధీతన ఆహార ప్రాధాన్యతలను పంచుకున్నారు.‘ మమ్, మామరీస్, మర్మలాడె’ పేరుతో ఉన్న ఈ వీడియోల తల్లీ కొడుకులిద్దరూ ప్రియాంకా గాంధీ చేసిన వంటకాన్ని ఫాలో అవుతూ ఆరంజ్ మార్మలాడె(జామ్‌లాంటి తీపి వంటకం)ను తయారు చేస్తూ కనిపిస్తారు.
అంతేకాకుండా వారిద్దరూ సరదాగా మాట్లాడుకొంటూ జోకులేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఒక వేళ బిజెపి వాళ్లకు ఈ జామ్ కావాలనుకుంటే పంపవచ్చుకదా, అమ్మా’ అని రాహుల్ అనగా, ‘వాళ్లు దీన్ని మనమొహం మీద విసిరేస్తారు’ అని సోనియా సమాధానం చెప్తారు. ‘అది కూడా మంచిదే. మనం దాన్ని తిరిగి తీసుకోవచ్చు’ అని రాహుల్ బదులు ఇస్తారు. కాగా ‘ఇది నా సోదరి ప్రియాంక చేసే వంటకం, ఆమె దీన్ని మెరుగుపరిస్తే నేను దాన్ని ఫాలో మాత్రమే అవుతున్నాను’ అని రాహుల్ చెప్పారు.
దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉండే ఆ వీడియోలో సోనియా గాంధీ రాహుల్‌గాంధీలో తనకు చికాకు కలిగించేది ఏమిటో కూడా చెప్పేశారు.‘ అతను చాలా మొండి వాడు. నేను కూడా అంతే. మేమిద్దరమూ అలాంటి వాళ్లమే’ అని సోనియా చెప్పారు. రాహుల్‌లో తాను ఇష్టపడే విషయం కూడా ఆమె చెప్పారు. చాలా ఆప్యాయత కలిగిన వాడని, ఎదుటి వారి పట్ల శ్రద్ధ చూపిస్తాడని అన్నారు. ముఖ్యంగా తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు రాహుల్, ప్రియాంకలు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కూడా ఆమె చెప్పారు.
ఇంట్లో ఎవరు వంట బాగా వండుతారనే దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన అమ్మమ్మ( సోనియా తల్లి) బాగా వంట చేస్తారన్నారు. అప్పట్లో తన తండ్రి కాశ్మీరీ బంధువులనుంచి ఆమె( సోనియా) చాలా నేర్చుకున్నారని కూడా చెప్పారు. ఆహార ప్రాధాన్యతల గురించి సోనియా మాట్లాడుతూ..‘ ఎవరైనా భారతీయుడు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఫుడ్‌కు అలవాటు పడలేరు. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ ఫ్లేవర్స్‌కు ముఖ్యంగా మిర్చికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది’ అని ఆమె చెప్పారు. తనకు ధనియాలంటే ఇష్టం లేదని సోనియా చెప్పగా, ఇప్పుడు ఆమె దాన్ని చాలా ఇష్టపడతారని రాహుల్ వెంటనే అన్నారు. అలాగే తన తల్లి మొదట్లో పచ్చళ్లు అంటే ఇష్టపడేది కాదని, కానీ ఇప్పుడు బాగా ఇష్టపడతారని కూడా రాహుల్ చెప్పారు.