Monday, December 23, 2024

మైనస్ మంచు…. విఫలరిలాక్స్

- Advertisement -
- Advertisement -

సిమ్లా… వెలవెల.. 40 ఏండ్ల అత్యల్పం

సిమ్లా : పర్యాటక కేంద్రం సిమ్లాలో నూతన సంవత్సర వేడుక రద్దీ ఈసారి తగ్గింది. దీనితో ఇప్పుడు ఇక్కడి అతిధి గృహాలు, హోటల్స్‌లో 60 శాతంపైగా గదులు భర్తీ అయ్యాయి. గడిచిన 40 ఏండ్లలో ఇది తక్కువ స్థాయి ఆక్యుపెన్సీ అని వెల్లడైంది. వారాంతపు హిమపాతం, మందుబాబుల పట్ల రిలాక్స్ నిబంధనలు వెలువరించినా ఫలితంలేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం వరకూ సిమ్లాలో కేవలం 60 శాతమే పర్యాటక భర్తీ జరిగింది. గత ఏడాది ఈ దశలో సిమ్లాలో 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఈసారి హిమపాతపు కొత్త ఏడాది ఉంటుందని , ఇది పర్యాటకులకు కనువిందుగా తమకు లాభాలపంటగా మారుతుందని స్థానిక హోటల్, అనుబంధ వ్యాపార వర్గాలు ఆశించాయి. అయితే వీరి ఆశలు అడుగంటాయి. అయితే మాల్ రోడ్డు, ది రిడ్జ్ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంది. ఇక్కడ జరిగే వింటర్ కార్నివాల్‌లో జాతర సందడి ఉంటుంది. పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు, , అలంకరణలు, విద్యుద్దీపాల వెలుగులు వంటివి అందరిని ఆకట్టుకుంటాయి. ఇతర చోట్ల పెద్దగా సందడి లేదని సిమ్లా హోటల్ టూరిజం సంఘం అధ్యక్షులు ఎంకె సేథ్ తెలిపారు. ఇప్పుడు సిమ్లాకు పర్యాటకుల తాకిడి 50 నుంచి 60 శాతం మధ్యలోనే ఉంది.

కోవిడ్ దశలో కూడా ఇక్కడ ఇంతటి తక్కువ స్థాయిలో పర్యాటకుల రాక లేదని స్థానిక అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పర్యాటకులను ఆకట్టుకునేందుకు చాలారోజుల ముందునుంచే రంగంలోకి దిగారు. పోలీసులు పర్యాటకుల పట్ల అతిధి దేవో భవ పద్ధతి పాటించాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆహార భోజనశాలల ఏర్పాటు, పాన్‌షాపులు రోజంతా తీసివుంచేందుకు ఏర్పాట్లు చేయించారు. ఇక పర్యాటకులు ఆల్కహాల్ తీసుకున్నా అరెస్టు చేయవద్దని, అయితే పోలీసు సిబ్బంది వారిని జాగ్రత్తగా వారివారి బసలకు క్షేమంగా తీసుకువెళ్లాలని సిఎం ఆదేశించారు.

మందు తీసుకుని రాద్ధాంతాలకు దిగకుండా మర్యాదపూరిత చర్యలకే దిగాలని సూచించారు. అయితే అధీకృత పర్యాటక విడిది ప్రాంతాల అంటే హోటళ్లకు వచ్చే వారిని అనధికారిక టూరిజం దందాల వారు దెబ్బతీస్తున్నారు. కొందరు ఏజెంట్లు పర్యాటకులను సిమ్లాకు ముందే పసికట్టి వారిని తమ అనధికారిక బసలకు చేరుస్తున్నారని హోటల్స్ సంఘం నేత తెలిపారు. ఇటువంటి ఏజెంట్లతో తమ వంటి లైసెన్స్ వ్యాపారాల వారు దెబ్బతింటున్నారని, పైగా అనధికారిక పర్యాటక ఏజెంట్లతో సిమ్లా పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News