హుందయ్, ఎంజి మోటార్‌లో వృద్ధి
ముంబై : దేశీయంగా కార్ల అమ్మకాలు ఊపందున్నాయి. డిసెంబర్ పలు వహన సంస్థలు మెరుగైన అమ్మకాలను చూశాయి. అయితే వీటిలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) నిరాశపర్చింది. గత నెలలో కంపెనీ దాదాపు 1,37,551 కార్లను విక్రయించింది. 2022 డిసెంబర్‌లో విక్రయాలు 1,39,347 యూనిట్లతో పోలిస్తే ఈసారి కొంతమేరకు తగ్గాయి. యుటిలిటీ వాహనాలు మినహా అన్ని ప్యాసింజర్ వాహనాల్లో ఈ క్షీణత కనిపించింది.
అయితే కంపెనీ వాహనాల ఎగుమతులు 26,884 యూనిట్లకు పెరిగాయి. అంతకుముందు 2022 డిసెంబర్‌లో ఈ ఏగుమతులు 21,796 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. 2023 సంవత్సరంలో కంపెనీ ఎగుమతులు ఆల్‌టైమ్ హై 2,69,046 యూనిట్లకు చేరాయి. 2022లో మొత్తం ఎగుమతులు 2,63,068 యూనిట్లు ఉన్నాయి. డేటా ప్రకారం, ఆల్టో, ఎస్ ప్రెస్సో వంటి ఎంఎస్‌ఐఎల్ మినీ సెగ్మెంట్‌లోని వాహనాలు 2,557 యూనిట్లకు తగ్గగా, ఇది 2022 డిసెంబర్‌లో 9,765 యూనిట్లుగా ఉంది.
హుందయ్ మోటార్స్
హుందయ్ మోటార్స్ మొత్తం సెల్స్ గత నెలలో 7,65,786 యూనిట్లతో 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది(2022)లో సేల్స్ 7,00,811 యూనిట్లు ఉన్నాయి. క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ దేశీయంగా గరిష్ఠ స్థాయి అమ్మకాల రికార్డును సాధించింది. సంస్థ ఎగుమతులు 1,48,300 యూనిట్ల నుంచి 1,63,675 యూనిట్లకు పెరిగాయి.
ఎంజి మోటార్ ఇండియా
ఎంజి మోటార్ ఇండియా డిసెంబర్ అమ్మకాలు 56,902 యూనిట్లతో 18 శాతం వృద్ధిని సాధించాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 25 శాతం సేల్స్ నమోదయ్యాయి. కంపెనీకి చెందిన కామెట్ ఇవి అమ్మకాలు 20 వేల యూనిట్ల మార్క్ చేరుకున్నాయి. సంస్థ 18 శాతం వృద్ధిని చూడగా, వరుసగా నాలుగో సంవత్సరం ఈ వృద్ధిని నమోదు చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) డిసెంబర్‌లో 60,188 యూనిట్లతో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ డివిజన్) విజయ్ నక్రా మాట్లాడుతూ, కొన్ని భాగాల్లో సంస్థ సరఫరా పరమైన సమస్యలను ఎదుర్కొన్నది, వీటిని పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్యాసింజర్ వాహన సేల్స్ డిసెంబర్‌లో 35,174 యూనిట్లతో 24 శాతం వార్షిక వృద్ధిని చూశాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు కూడా 35,171 యూనిట్లతో 24 శాతం పెరిగాయి. ట్రాక్టర్ సేల్స్ డిసెంబర్‌లో 18 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే 2023లో దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు 17 శాతం తగ్గాయి. ట్రాక్టర్ ఎగుమతులు 1,603 యూనిట్ల నుంచి 1,110 యూనిట్లకు తగ్గాయి, అంటే 31 శాతం క్షీణత నమోదైంది.
ఐషర్ మోటార్స్
2023 డిసెంబర్‌లో కంపెనీ విఇ కమర్షియల్ వాహనాన సంస్థ డిసెంబర్‌లో సేల్స్ 8,026 యూనిట్లతో 11.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ట్రక్‌లు, బస్సుల అమ్మకాలు 7,468 యూనిట్లు నమోదు చేసింది. ట్రక్, బస్సుల ఎగుమతులు 321 యూనిట్లతో 3.3 శాతం తగ్గగా, గతేడాదిలో 332 వాహనాల సేల్స్ మాత్రమే నమోదయ్యాయి.
బజాజ్ ఆటో
2023 డిసెంబర్‌లో బజాజ్ ఆటో అమ్మకాల్లో 3,26,806 యూనిట్లతో 16 శాతం వృద్ధిని చూసింది. ద్విచక్ర వాహన అమ్మకాల్లో 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ ద్విచక్ర వాహనాల సేల్స్ 26 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్విచక్ర వాహన ఎగుమతులు 1,21,499 యూనిట్ల నుంచి 1,24,631 యూనిట్లకు పెరిగాయి.
టొయొటా కిర్లోస్కర్ మోటార్
2023లో కంపెనీ టోకు అమ్మకాల్లో 2,33,346 యూనిట్లతో 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలు 2,21,356 యూనిట్లు ఉన్నాయి. 2023లో ఎగుమతులు 11,984 యూనిట్లు నమోదు చేశాయి.