మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ తాజాగా వన్డేల నుంచి కూడా తప్పకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని వార్నర్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలిచిప ప్రస్తుత తరుణంలోనే తానే ఆటకు గుడ్‌బై చెబితే బాగుంటుందని పేర్కొన్నాడు. అందుకే అన్నీ ఆలోచించి వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా, పాకిస్థాన్‌తో సొంత గడ్డపై సిడ్నీలో చివరి టెస్టు మ్యాచ్‌ఆడనున్నాడు.
వార్నర్ కెరీర్‌లో ఇదే చివరి టెస్టు మ్యాచ్ కానుంది. ఇదిలావుంటే భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ తర్వాత వార్నర్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే సమయంలో ఉన్నట్టుండి వన్డేల నుంచి తప్పుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశాడు. అయితే 2025లో జరిగే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం పునరాగమనం చేస్తానని వార్నర్ పేర్కొనడం గమనార్హం. కాగా, వన్డేలకు గుడ్‌బై చెప్పినా టి20లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తానని తెలిపాడు. ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లలో ఆడతానని పేర్కొన్నాడు.
టెస్టు, వన్డేల నుంచి తప్పుకుంటే ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందన్నాడు. అందుకే తాను ఈ రెండు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించానని వెల్లడించాడు. కాగా, సుదీర్ఘ వన్డే కెరీర్‌లో వార్నర్ ఆస్ట్రేలియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో వార్నర్ రెండు శతకాలతో సహా 528 పరుగులు చేసి ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలుపడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో వార్నర్ 161 వన్డేలు ఆడి 6,992 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, మరో 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలావుంటే వన్డేల్లో వార్నర్ స్ట్రైక్ రేట్ 97.26 కావడం విశేషం.