కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ విలీనం కాబోతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా ప్రకటించారు. తమ పార్టీ గురువారంనాడు కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఆమె తెలిపారు. షర్మిల లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఇకపై తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తానన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మంనుంచి గానీ నల్లొండ నుంచి గానీ పోటీ చేస్తానన్నారు. షర్మిల బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ అవుతారు. అదే రోజు వారి సమక్షంలోనే ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది.
తనకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆఫర్ చేసిందనీ షర్మిల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉండమని కోరారని తెలిపారు. అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు.