వినడానికే వింతగా ఉన్నా ఇది నిజమండీ! పక్షి ఒకటే. కానీ అది సగం ఆడ.. సగం మగ. అత్యంత అరుదుగా కనిపించే ఈ రకం పక్షిని న్యూజీలాండ్ కు చెందిన ఇద్దరు పక్షిశాస్త్రవేత్తలు తమ కెమెరాలో బంధించారు. గత వందేళ్లలో ఇలాంటి పక్షిని ఎవరూ చూసి ఎరుగరట.
యూనివర్శిటీ ఆఫ్ ఒటాగోకు చెందిన జూవాలజిస్ట్ ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ తన స్నేహితుడు, పక్షి శాస్త్రవేత్త అయిన జాన్ మరిల్లో కలసి సెలవుల్లో కొలంబియాకు వెళ్ళి అరుదైన పక్షులకోసం అన్వేషిస్తుండగా వారికి గ్రీన్ హనీక్రీపర్ అనే పక్షి కనిపించింది. కాస్త దగ్గరగా చూస్తే అది విలక్షణమైన ఆడ, మగ లక్షణాలు కలిగిన పక్షి అని తెలిసి, ఆశ్చర్యపోయారు. కొన్ని రకాల సాలీళ్లలోనూ, పక్షులలోనూ అరుదుగా ఇలాంటి ఆడ, మగ లక్షణాలున్నవి ఉంటాయి. వీటిని బైలేటరల్ గైనండ్రోమార్ఫిక్ (ద్విపార్శ్వ ద్విలింగ లక్షణాలున్న జీవి) అంటారు.
శాస్త్రవేత్తలకు తారసపడిన ఈ పక్షిలో ఒకవైపు ఆకుపచ్చ, మరొకవైపు నీలిరంగు ఉన్నాయి. ఆడలక్షణాలున్న భాగం ఆకుపచ్చరంగులోనూ, నీలిరంగులో ఉన్న భాగం మగలక్షణాలతోనూ ఉంటాయి. ఆడ, మగ ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా ఒకే పక్షిలో ఉండటం విశేషం. ఆడ పక్షి అండం విడుదల చేసే సమయంలో జరిగే కణ విభజనలో చోటు చేసుకునే లోపంతోపాటు అదే అండం రెండు శుక్రకణాలతో ద్విఫలదీకరణ చెందడం వల్ల ఇలాంటి జీవులు ఉత్పన్నమవుతాయి.