Monday, December 23, 2024

రైలు ప్రమాదాల నివారణ చర్యలపై కేంద్రాన్ని వివరాలు కోరిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న, లేదా అమలు చేయడానికి ప్రతిపాదించిన నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం కోరింది. రైలు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ కాపీని అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించాలని పిటిషనర్ విశాల్ తివారీకి ధర్మాసనం సూచించింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది జూన్‌లో ఒడిశా లోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యలను వెల్లడించాలని పిటిషనర్ కోరారు.

రైళ్లు ఢీకొనకుండా నిరోధించడానికి ప్రభుత్వం అనేక భద్రతా వ్యవస్థలను ప్రవేశ పెట్టిందని, అయినప్పటికీ గత సంవత్సరంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. భారతదేశం అంతటా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఏదైనా కసరత్తు జరిగిందా? అని బెంచ్ ప్రశ్నించింది. ప్రతిదానికి ఆర్థిక అంశంతో పరస్పర సంబంధం ఉందని, ఎందుకంటే అంతిమ భారం ప్రయాణికుల పైనే ఉంటుంది.

రైల్వేలో సేఫ్టీ పారామితులను విశ్లేషించేందుకు సమీక్షించడానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన సాంకేతిక సభ్యులతో కూడిన నిపుణుల కమిషనర్ ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. వేగంగా పకడ్బందీ వ్యవస్థను అమలు చేయకపోవడం వల్లనే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News