న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు తప్పుడు సమన్లు పంపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఉన్న అతి పెద్ద బలం, ఆస్తి తన నిజాయితీయేనని అన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇడి జారీచేసిన మూడు సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఆయనను ఇడి ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చంటూ గురువారం వదంతులు వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో ఇడి అరేక దాడులు, అరెస్టులు చేసినప్పటికీ ఒక్క పైసా అవినీతిని చూపించలేకపోయిందని ఆయన అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో తాను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే బిజెపి ఇడి ద్వారా అరెస్టు చేయించాలని భావిస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవం ఏమిటంటే అసలు అవినీతి అంటూ ఏదీ జరగలేదు. నన్ను అరెస్టు చేయాలని బిజెపి కోరుకుంటోంది.
నా నిజాయితీయే నాకున్న పెద్ద ఆస్తి. దాన్ని దెబ్బతీయాలని బిజెపి భావిస్తోంది అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వ్యాఖ్యానించారు. తనకు పంపించిన సమన్లు చట్టవిరుద్ధమైనవని తన న్యాయవాదులు తనకు చెప్పారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేయకుండా తనను అడ్డుకోవాలని బిజెపి భావిస్తోందని ఆయన ఆరోపించారు. దర్యాప్తు పేరిట పిలిపించి అరెస్టు చేయాలని ఇడి భావిస్తోందని ఆయన తెలిపారు. తనకు పంపిన సమన్లు చట్ట విరుద్ధమని తాను ఇడికి రాసిన లేఖలో చెప్పానని ఆయన తెలిపారు. అసలు తనను ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో స్పష్టం చేయాలని ఇడిని కోరానని, కాని అటువైపు నుంచి సమాధానం లేదని ఆయన చెప్పారు.
కాగా.. కేజ్రీవాల్ విలేకరుల సమావేశం తర్వాత కొద్ది సేపటికే ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూడా విలేకరులతో మాట్లాడుతూ నిజాయితీకి ప్రతిరూపం కేజ్రీవాల్ అంటూ కీర్తించారు. ఆ ముద్రను చెరిపేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేయకుండా, ఆయన ఎంపీగా పోటీ చేయకుండా అడ్డుకోవడానికి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.
ఇది అరవింద్ కేజ్రీవాల్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, నిజానికి ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని ఆయన అన్నారు. తమతో చేతులు కలపాలన్న ఉద్దేశంతోనే కేజ్రీవాల్‌పై బిజెపి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా..రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ శనివారం నుంచి మూడు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన బహిరంగ సభలలో ప్రసంగించడంతోపాటు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని వారు చెప్పారు.