ముంబై : హిందువుల ఆరాధ్య వేలుపుగా పూజలు అందుకునే శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసం తినేవారని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ రాముడు బహుజనులకు చెందిన వాడు. 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు, శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తాడు ? అవునా కాదా ? నేను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను” అంటూ వ్యాఖ్యానించారు. అవద్ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు ఆయనపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై అవద్ క్షమాపణలు కోరారు. రామాయణంలో ఉన్నదే తాను చెప్పానని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని అభ్యర్థించారు.
వ్యాఖ్యలపై దుమారం
ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బీజేపీ నేత రామ్‌కదమ్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. తాజాగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ వ్యాఖ్యలు తప్పని పేర్కొన్నారు. రాముడు వనవాసంలో మాంసాహారం తిన్నాడని ఏ గ్రంథం లోనూ రాయలేదన్నారు. దుంపలు, పండ్లుతిన్నట్టుగా ప్రతిచోటా రాసి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు రామభక్తుల మనోభావాలని దెబ్బతీశాయని అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలని కోరతామన్నారు. జితేంద్ర అవద్‌పై కఠిన చర్యలు తీసుకోకుంటే చంపేస్తామని హెచ్చరించారు.