Wednesday, November 27, 2024

మెగా విరాళంలో మేఘా వివక్ష..

- Advertisement -
- Advertisement -
  • మెగా విరాళంలో మేఘా వివక్ష
  • జాతీయ పార్టీ కాంగ్రెస్ కు మొండిచెయ్యి
  • ప్రూడెంట్ ట్రస్ట్ కు రూ.87కోట్లు ఇచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
  • జేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ సిపిలకే సింహభాగం విరాళాలు

రాజకీయ పార్టీలకు ఏటా వివిధ వ్యాపార సంస్థలు విరాళాలు ఇవ్వడం మామూలే. విరాళాల సేకరణ జరిపే ఎలక్టోరల్ ట్రస్టులు.. తమకు అందిన డబ్బును ఆయా రాజకీయ పార్టీలకు అందించడం కూడా అంతే పరిపాటి. అయితే ఆయా పార్టీలకు ట్రస్టుల ద్వారా వందల కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చిన అనేక వ్యాపార సంస్థలు… ప్రముఖ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను చిన్నచూపు చూడటం గమనార్హం. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 54వ స్థానంలో ఉన్న ‘మేఘా’  సంస్థ అధినేత పి.వి కృష్ణారెడ్డి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 87 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి, రికార్డు నెలకొల్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆయన మొండిచెయ్యి చూపించారు. ఆయన ఇచ్చిన విరాళంలో అధిక మొత్తం బిజేపీ, బీఆర్ఎస్ లకే అందింది.

పి.వి. కృష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు రూ.87 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆయా ట్రస్టులకు అందిన వాటిలో ఇదే భారీ విరాళం. మేఘా తర్వాత ప్రూడెంట్ కు భారీ మొత్తంలో విరాళాలు అందజేసిన సంస్థలలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ (50.25 కోట్లు), ఆర్సెలర్ మిట్టల్ నిహాన్ స్టీల్ ఇండియా (50 కోట్లు), హైదరాబాద్ కే చెందిన మరో ప్రముఖ సంస్థ మేథా సెర్వో డ్రైవ్స్ (35 కోట్లు) ఉన్నాయి.

ప్రూడెంట్ ట్రస్ట్ కు 2022-23 సంవత్సరంలో విరాళాల రూపంలో మొత్తం రూ. 363.16 కోట్లు అందాయి. తెలంగాణా నుంచి 13 విరాళాల రూపేణా 145.51 కోట్లు, మహారాష్ట్ర నుంచి ఆరు విరాళాల రూపంలో 105.25 కోట్లు ఈ ట్రస్ట్ కు అందాయి. అయితే వీటిలో ఒక్క రూపాయి కూడా ఈ ట్రస్టు ద్వారా కాంగ్రెస్ పార్టీకి అందలేదు. ప్రూడెంట్ నుంచి బిజేపీకి 256.25 కోట్ల రూపాయలు, బీఆర్ఎస్ కు 90 కోట్లు, వైఎస్ఆర్ సిపికి 16 కోట్లు అందాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కన్వీనర్ గా ఉన్న ఆప్ పార్టీకి కూడా ప్రూడెంట్ 90 లక్షలు అందజేసింది.

యుపిఎ ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ (ఇటి)ను అనుసరించి కంపెనీల చట్టం సెక్షన్ 25 కింద ఏ కంపెనీ అయినా ఎలక్టోరల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయవచ్చు. ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి అందే విరాళాలను ఈ ట్రస్టులు రాజకీయ పార్టీలకు అందజేస్తాయి. ఇలా భారతీ గ్రూప్ నెలకొల్పినదే ప్రూడెంట్ ట్రస్ట్.

దేశంలో మొత్తం 18 ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా వాటిలో 13 మాత్రమే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) వద్ద రిజిష్టరయ్యాయి. ఇవి 2022-23వ ఆర్థిక సంవత్సరానికి తమ విరాళాల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందజేశాయి. ఈ పదమూడు ట్రస్టుల్లో ఎనిమిదింటికి విరాళాలు అందలేదు. మిగిలిన ఐదు ట్రస్టులకు కలిపి రూ.366. 48 కోట్లు అందాయి. ఈ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి అందింది కేవలం 50 లక్షలు. సమాజ్ ఇటి అసోసియేషన్ అనే ట్రస్టుకు అందిన రెండు కోట్ల రూపాయల విరాళంలో కాంగ్రెస్ కు రూ.50 లక్షలు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News