Monday, December 23, 2024

మహారాష్ట్ర పెంచ్ టైగర్ రిజర్వులో కొత్త జాతుల మొక్కలు 

- Advertisement -
- Advertisement -

నాగపూర్ : మహారాష్ట్ర లోని పెంచ్ టైగర్ రిజర్వులో గోల్ పహాడీ ఐల్యాండ్‌లో చేపట్టిన సర్వేలో పోలీగొనమ్ జాతికి చెందిన కొత్త తెగల మొక్కలను కనుగొన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పెంచ్ టైగర్ రిజర్వులో దాదాపు ఏడాది పాటు నిర్వహించిన ఈ సర్వేలో 554 జాతులు, 117 కుటుంబాలకు చెందిన 863 కొత్త తెగల మొక్కలను కనుగొనడమైందని పెంచ్ టైగర్ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రభునాథ్ శుక్లా వెల్లడించారు. కొత్తగా కనుగొన్న మొక్కల తెగలకు “పోలీగొనమ్ చతుర్‌భుజనమ్‌” అని పేరు పెట్టినట్టు వివరించారు. ఇవి మూలికలుగా సర్వేయర్లలో ఒకరైన డాక్టర్ కె. చంద్రమోహన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ లోనే కనిపించే ఆరు కొత్త తెగల మొక్కలను కూడా పెంచ్ రిజర్వులో కనుగొన్నామని చెప్పారు. ఆ ఆరు రకాలు ఏజెనెటా ఇండికా, బొయెర్‌హెవియా క్రిస్పా, హెబెనేరియా గిబ్‌సోనీ వార్ ఫోయిటిడా, ఇఫెజెనియా పల్లిడ, పెటలిడియమ్ బార్లెరియోడిస్, బర్లేరియా గిబ్‌సోని గా శుక్లా ఒక ప్రకటనలో వివరించారు.

సర్వేలో వివిధ రకాలైన వృక్షజాతులు కనిపించాయని, వాటిలో 294 మూలికలు, 157 సహజమైన వృక్షాలు, 131 ప్రాకే మొక్కలు, 131 గడ్డిమొక్కలు, 52 పొదలు, మిగతా రకాలు తోపులు, నాచు మొక్కలుగా పేర్కొన్నారు. పెంచ్ రిజర్వులో మైదానాలు విస్తారంగా లేకపోయినప్పటికీ గడ్డి తెగల మొక్కల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపించడం ఆసక్తి కలిగించిందని , వీటిలో ఎక్కువ శాతం పందిరి కింద ఉన్నాయని చెప్పారు. 46 తెగల మొక్కలు భారత్‌లోనే ఉంటాయని, మరో 32 తెగల మొక్కలు అరుదైనవని, వీటిలో ఆరు ప్రత్యేకంగా భారత ఉపఖండానికే పరిమితమని వివరించారు. ఇలాంటి సర్వేల నుంచి లభించిన సమాచారం వృక్ష సంతతిని పర్యవేక్షించడానికి, వాటి పర్యావరణంలో ఏవైనా అలజడులు కలిగితే ఎలా స్పందిస్తాయో తెలుసుకోడానికి ముఖ్యంగా, పర్యావరణ సమతుల్యతను నిర్వహించడానికి ఈ సర్వేలు ఉపయోగమవుతాయని పేర్కొన్నారు.

నాగపూర్ జిల్లాలో 1136 కొత్త తెగల మొక్కలు
1986లో నాగపూర్ జిల్లాలో నిర్వహించిన సర్వేలో 669 జాతులకు, 142 కుటుంబాలకు చెందిన 1136 కొత్త తెగల మొక్కలు కనిపించాయి. దేశం మొత్తం మీద వృక్షజాతుల వైవిధ్యంలో 5.8 శాతం పెంచ్ రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉండడం విశేషం. 45,000 వివిధ తెగల మొక్కలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద వృక్షసంతతిలో 15,000 పుష్పజాతుల మొక్కలతోపాటు మొత్తం 45,000 వివిధ తెగల మొక్కలతో దాదాపు 7 శాతం ఈ రిజర్వు ఫారెస్ట్ లోనే ఉండడం అరుదైన విషయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News