మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప స్వాములకు టిఎస్ ఆర్టీసి శుభవార్తను చెప్పింది. కేరళలోని అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టిఎస్ ఆర్టీసి ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ఈ బస్సులో వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి రూ. 13,600 చొప్పున చార్జీలను ఆర్టీసి వసూలు చేయనుంది. ఈ చార్జీల్లో భాగంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం ఉంటాయని ఆర్టీసి అధికారులు తెలిపారు. నేటి నుంచి లహరి బస్సు ఎంజీబిఎస్ నుంచి బయలుదేరి మొత్తం 7 రోజుల్లో శబరికి తీసుకెళ్లి తిరిగి ఎంజీబిఎస్ బస్టాండ్‌కు చేరుకుంటుందని ఆర్టీసి అధికారులు తెలిపారు.
ఈ బస్సుల షెడ్యూల్ ఇలా…
తొలి రోజు సాయంత్రం 3 గంటలకు ఎంజీబిఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండోరోజు సాయంత్రం 7.30 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ దర్శనం అనంతరం తిరిగి అదే రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుంది. మూడో రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయర్‌కు చేరుకుంటుంది. తిరిగి 12.30 గంటలకు బయలుదేరుతుంది. మూడో రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమెలి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరుతుంది. నాలుగో రోజు ఉదయం 9.20 గంటలకు పంబ చేరుకుంటుంది. అక్కడి నుంచి మద్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. ఐదో రోజు ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి 9.20 గంటలకు ప్రారంభమవుతుంది.
ఐదో రోజు సాయంత్రం 5.30 గంటలకు మధురై చేరుకుంటుంది. తిరిగి 11.20 గంటలకు బయలుదేరుతుంది.
ఆరో రోజు ఉదయం 7.30 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 6.10 గంటలకు కంచికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఏడో రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు బయలుదేరుతుంది. 7వ రోజు ఉదయం 11.10 గంటలకు మహానందికి చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 11.30 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా తిరిగి ఎంజీబిఎస్‌కు చేరుకుంటుంది.