న్యూఢిల్లీ : తమిళనాడు యువజన , క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని దేశ రాజధానిలో కలిశారు. డిఎంకె అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి ప్రధానిని కలుసుకోవడం కీలక పరిణామం అయింది. తమిళనాడులో ఇటీవలి వరదల బాధిత ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం అభ్యర్థించేందుకు ఉదయనిధి ఇక్కడికి వచ్చారు. ప్రధాని అధికార నివాస గృహానికి వచ్చిన ఉదయనిధి ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు.
వరద బాధిత ప్రాంతాలలో తక్షణ సహాయ చర్యలకు తమ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి సాయం కోరుతున్నారని, ఆయన తరఫున తాను ఇక్కడికి వచ్చానని ఈ నేపథ్యంలో ఉదయనిధి తెలిపారు. అవసరం అయిన చర్యలు కేంద్రం నుంచి తీసుకుంటామని ఉదయనిధి స్టాలిన్‌కు ప్రధాని భరోసా ఇచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఉదయనిధి ప్రధానికి కాఫీటేబుల్ బుక్ బహుకరించారు. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి చెన్నైలో జరిగే ఖేలో ఇండియా గేమ్స్‌కు అతిధిగా రావాలని కూడా ప్రధానిని ఉదయనిధి కోరారు.