Saturday, November 23, 2024

ఇడి అధికారులపై తృణమూల్ దాడి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఇదే కేసులో అరెస్టయిన రాష్ట్ర మంత్రికి సన్నిహితుడైన షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఇడి అధికారులపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. అధికారులను విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగలు తీశారు.

అధికారులకు రక్షణగా వచ్చిన సిఆర్‌పిఎఫ్ బలగాలకు చెందిన వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తమకన్నా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఉండడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంపై ఇడి దర్యాప్తు చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అబ్ధిదారులకు అందచేసే రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు మళ్లించారని, దాని ద్వారా వచ్చిన సొమ్మును రేషన్ డీలర్లు, మిల్లర్లు పంచుకున్నారని ఇడి గతంలో ఆరోపించింది. కోట్లాది రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను ఇడి ఇదివరకే అరెస్టు చేసింది.

మంత్రి మల్లిక్‌కు షాజహాన్ సన్నిహితుడిగా పరిగణిస్తున్నారు. షాజహాన్ అనుచరులు జరిపిన దాడిలో మీడియాకు చెందిన టివిఆ కెమెరాలు, బ్రాడ్‌కాస్ట్ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు జర్నలిస్టులు, సహాయక సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాజహాన్ మద్దతుదారుల దాడిలో తలలు పగిలి, రక్తసిక్త గాయాలైన ఇడి అధికారులు తమ వాహనాలు కూడా ధ్వంసం కావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఆటోరిక్షాలో అక్కడి నుంచి పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో తలదాచుకున్నారు. కొన్ని గంటల వరకు వారి వెంట వచ్చిన భద్రతా సిబ్బందికి సైతం అధికారుల ఆచూకీ తెఇయరాలేదు. సంఘటన జరిగిన ప్రదేశానికి అనేక కిలోమీటర్ల దూరంలోని బసంతి హైవేపైన తమ ధ్వంసమైన వాహనాలలోనే  సిఆర్‌పిఎఫ్ జవాన్లు వేచి ఉండడం కనిపించింది. గాయపడిన అధికారులు కలకత్తాకు చేరుకుని అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వర్గాల ద్వారా సమాచారం అందింది.

అసలేం జరిగింది

మంత్రి జ్యోతిప్రియా మల్లిక్‌కు అత్యంత సన్నిహితులుగా పరిగణిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు శంకర్ ఆద్య, షాజహాన్ షేక్ నివాసాలపై దాడులు జరిపేందుకు శుక్రవారం  ఉదయం ఇడి అధికారులు చేరుకున్నారు. ఇడి అధికారులు అక్కడకు చేరుకున్న సమయంలో ఆ ఇద్దరు నాయకులు ఇళ్లలో లేరు. ఉదయం 8 గంటల ప్రాంతంలో షాజహాన్ ఇంటికి చేరుకున్న ఇడి అధికారులకు బయట ఇంటికి తాళం కనపడింది. బయట గేటుకు కూడా తాళం ఉండడంతో వారు అక్కడ కొద్ది సేపు వేచి ఉన్నారు. ఇంతలో అక్కడకు ఒక్కొక్కరిగా స్థానికులు చేరుకోవడం మొదలైంది. మహిళలతోసహా పెద్ద సంఖ్యలో అక్కడకు స్థానికులు ,చేరుకుని ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారంటూ వారిని నిలదీశారు. బయట గేటు తాళాన్ని పగటగొట్టి లోపలకు వెళ్లడాఇకి అధికారులు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. స్థానికులతోపాటు కొందరు సంఘ విద్రోహక శక్తులు కూడా అక్కడకు చేరుకుని ఇడి అధికారులపై విరుచుకుపడ్డారు.

విచక్షణారహితంగా చేయి చేసుకున్నారు. షాజహాన్ ఇంటి ముందు నుంచి వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. దాడికి పాల్పడుతున్న వారి సంఖ్యతో పోలిస్తే తాము తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా భద్రతా సిబ్బంది కూడా మౌనంగా జరుగుతున్న దాడిని చూస్తుండిపోయారు. ఇడి అధికారులు వచ్చిన వాహనాలపై రాళ్ల దాడి చేశారు. అనేక వాహనాలు ధ్వంసమైపోయాయి. ఇడి అధికారుల బృందం వెంట వచ్చిన మీడియా ప్రతినిధులను సైతం షాజహాన్ మద్దతుదారులు విడిచిపెట్టలేదు. వారి వాహనాలను, టీవీ కెమెరాలను, బ్రాడ్‌కాస్టింగ్ పరికరాలను  కూడా ధ్వంసం చేశారు.

గ్రామంలోకి ప్రవేశించే పొలిమేరల్లో రోడ్డుకు అడ్డంగా దుంగలను వేసిన టిఎంసి మద్దతుదారులు టైర్లకు నిప్పు పెట్టి ఎవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కాగా..సందేశ్‌ఖలి ఘటన ఆందోళనకరమని, దురదృష్టకరమని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని, బిజెపి ఆదేశాల మేరకు  తృణమూల్ కాంగ్రెస్‌ను అవమానించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News