Sunday, November 24, 2024

సోనియా కోసం ఆరు నియోజకవర్గాలు రెడీ!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం, నల్లగొండ, మల్కాజిగిరిపై త్వరలో అధిష్టానం నిర్ణయం
గెలిపించే బాధ్యత సీనియర్‌లకు అప్పగింత
ఖమ్మంలో సోనియా గెలిస్తే ఏపిలోనూ పార్టీ మరింత పటిష్టం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానం ఎంపిగా పోటీచేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోనియాను ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్ స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి పోటీ చేయించే అవకాశాన్ని టిపిసిసి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కొంత కాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్టానానికి సైతం పంపారు. రెండోసారి జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ ఆమె తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న తీర్మానం చేసి పంపించారు. దీంతో ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఇదే విషయాన్ని ఏఐసిసి అధిష్టానం దృష్టికి సైతం సిఎం రేవంత్ తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఈ నాలుగు ఎంపి స్థానాల పరిధిలో అధిక అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగా సోనియా సునాయాసంగా విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ విషయమై త్వరలోనే సోనియాతో చర్చించి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఒకవేళ సోనియా ఖమ్మం ఎంపి స్థానం నుంచి పోటీ చేస్తే ఆమెను గెలిపించే బాధ్యతలను షర్మిల, పొంగులేటికి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలో భారీగా అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపుతో సోనియాను గెలిపించాలన్న ధీమాతో ముందుకెళుతున్నట్టుగా సమాచారం.
నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పట్టు
ఒకవేళ నల్లగొండ ఎంపిగా పోటీ చేస్తే సోనియాను గెలిపించే బాధ్యతను కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అప్పగించాలని టిపిసిసి భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ కూడా చాలా అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ హస్తగతం చేసుకోవడంతో అక్కడి నుంచి కూడా సోనియా సునాయాసంగా గెలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మహబూబ్‌నగర్ అయితే సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సోనియాను గెలిపించే దిశగా వ్యూహాలను రూపొందిస్తున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి డిసెంబర్ వరకు రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపిగా కొనసాగారు. దీంతో సోనియాను గెలిపించే బాధ్యత రేవంత్ అనుచరులతో పాటు మైనంపల్లి హన్మంతరావు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ముందుగా నిజామాబాద్ ఎంపి స్థానం నుంచి సోనియాను పోటీ చేయించాలని భావిస్తున్న దీనికన్నా మిగతా ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు బాగా ఉండడం కూడా సోనియా గెలుపునకు దోహదం చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు రాష్ట్రాలపై ప్రభావం..
ఖమ్మం నుంచి పోటీ చేయటం ద్వారా తెలంగాణలోనే కాకుండా, ఎపిపైనా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే వేగంగా పావులు కదుపుతున్నారు. ఇక ఎపిలోనూ సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు. వైసిపి, టిడిపిలకు చెక్ పెట్టేందుకు షర్మిలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో సరిహద్దు పార్లమెంట్ నియోజకవర్గమైన ఖమ్మం ఎంపి స్థానం నుంచి సోనియాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం.
వారిద్దరికే బాధ్యతలు..
సోనియా ఖమ్మం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం కావటంతో ఆమె గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ షర్మిలకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 10కి 9 స్థానాలు కైవసం చేసుకుంది. దానికి తోడు పొంగులేటి గతంలో ఖమ్మం ఎంపిగా పని చేశారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు ఉంది. వైఎస్ షర్మిలకు కూడా ఖమ్మం జిల్లాలపై పట్టుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు జిల్లాలో ఉన్నారు. దీంతో సోనియా గెలవటానికి ఖమ్మం సీటు సేఫ్ అని పొంగులేటి, షర్మిలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.
పోటీ చేస్తే ఇది రెండోసారి..
సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి సోనియాగాంధీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ను సోనియా ఓడించారు. తర్వాత మళ్లీ పాతికేళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1980లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News