Monday, December 23, 2024

సాగు పద్ధతుల్లో మార్పు రావాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే పండిస్తున్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మిషన్ కాకతీయ పేరుతో కాకతీయుల కాలం నాటి 70 వేలకు పైగా చెరువులు పూడిపోయిన, ఆక్రమణలకు గురయిన 40 వేల చెరువులకు మరమ్మతులు చేసిన ఫలితంగా అవి నీటి కళను సంతరించుకున్నాయి. మత్స్య సంపద పెరిగింది. ఇవి గాక ప్రాజెక్టుల ద్వారా నీటి సౌకర్యం కల్పనతో దాదాపు 45% సాగు విస్తీర్ణం పెరగడం హర్షదాయకమే. అయితే ఈ పెరుగుదల ఒక్క వరి పంటకే పరిమితమై, ఇతర పంటలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం విచారకరం. ప్రజలకు పుష్టిని, తుష్టిని చేకూర్చే పప్పుదినుసులు, నూనెగింజలు, ఆరోగ్యానికి మేలు చేసే జొన్న, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరు ధాన్యపు పంటలకు ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం, సిరిగలవారే సన్నన్నం తింటారని మహాకవి శ్రీనాథుని కాలం నాటి భావనలు అలాగే కొనసాగడం వల్ల,

కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ఏటా ఎంతో కొంత మద్దతు ధర పెంచుతూ పోవడంతో సాగు నీటి విస్తరణ జరిగిన ప్రాంతాలలో నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగు బాగా పెరిగింది. ఇతర ఆహార పంటలు, నూనె గింజలు, పండ్ల తోటలు అవసరాల మేరకు పెరగకపోవడం విచారకరం. వరి సాగు విస్తీర్ణం 70 శాతం పెరిగినా కంది, సెనగ, పెసర, మినుము తదితర పప్పుదినుసుల సాగు కేవలం 2 శాతమే పెరిగింది. నూనె గింజల సాగు విస్తీర్ణం కూడా 4 శాతమే పెరగడాన్ని బట్టి వైవిధ్యభరితమైన సమగ్ర పంటల సాగును ప్రోత్సహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంత శ్రద్ధవహించ లేదనే విషయం స్పష్టమవుతోంది. ప్రభుత్వ కృషి వల్ల 2020- 21 నాటికి వరి సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. 2014లో 58 లక్షల టన్నులుగా వున్న బియ్యం ఉత్పత్తి కోటి 2 లక్షల టన్నులు పెరిగినట్లు భూ వినియోగంపై వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రచురించిన గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో జొన్న, సజ్జ, కొర్ర, రాగి, తదితర చిరు ధాన్యాల సాగు 28 లక్షల టన్నుల నుండి 19 లక్షల టన్నులకు, నూనె గింజల సాగు 7.2 లక్షల టన్నుల నుండి 5.8 లక్షల టన్నులకు పడిపోవడం ఆందోళనకరమే.

దేశంలో, రాష్ట్రంలో చక్కెర వ్యాధి పెరుగుతూ వుండటం వల్ల బియ్యం వాడకం తగ్గించి ఆహారంలో జొన్న, సజ్జ, కొర్ర, రాగి వంటి తృణ ధాన్యాల వాడకం ద్వారా సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. తెలంగాణలో బియ్యం సేకరణ 2014లో 43 లక్షల టన్నులు కాగా, 2018-19 నాటికి 52 లక్షల టన్నులకు, 1920-21 నాటికి 95 లక్షల టన్నులకు పెరిగినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) వెల్లడించింది. సేద్యపు పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం వల్ల తెలంగాణలో వరి సాగు బాగా పెరిగి ఇతర పంటల విస్తీర్ణం తగ్గింది. ఇందువల్ల భూసారం క్షీణించడం, భూగర్భ జలవనరులు తగ్గిపోవడం, రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల బొగ్గు పులుసు వాయువు వంటి కర్బన ఉద్గారాలు పెరిగి పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్నది. ఒక కెజి బియ్యం ఉత్పత్తికి 3 నుండి 5 వేల లీటర్ల నీరు కావాలి.

అదే కెజి పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తికి 900 లీటర్ల నీరు చాలు. ప్రపంచ వ్యాప్తంగా వెలువడే కర్బన ఉద్గారాలలో వ్యవసాయం వరి సాగు ద్వారా వెలువడే బొగు పులుసు వాయువులు 9 నుండి 11 శాతం వున్నట్లు వాతావరణ మార్పులపై అధ్యయనం చేసిన అంతర్జాతీయ కమిటీ (ఐపిసిసి) వెల్లడించింది. అయితే దేశ ఆహార భద్రత, జీవనోపాధి పరిరక్షణ కోసం సుస్థిర సేద్యం, కాలుష్య రహిత ఆహార వ్యవస్థలకు సంబంధించిన అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. గత ఏడాది నవంబర్ 30 నుండి డిసెంబరు 12 వరకు వాతావరణ మార్పుల ప్రభావంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో అమలు చేయదగ్గ కార్యాచరణ ప్రణాళికను గురించి చర్చించారు. అయితే 2005 నాటి స్థాయికి చేరాలంటే బొగ్గుపులుసు వాయువుల వ్యాప్తిని 45 శాతం తగ్గించే కార్యాచరణను అమలు చేయాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. నీటి కొరత ఎక్కువగా వుండే తెలంగాణ,

రాయలసీమ వంటి ప్రాంతాలలో నీరు అధికంగా అవసరమయ్యే వరి, చెరకు పంటల సాగు సరికాదని, లాభదాయకం కాదని వ్యవసాయ శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. అదీగాక నువ్వుల పంట సాగు వల్ల 198 శాతం రాబడి వస్తోందని సేద్యపు వ్యయాలు, ధరల విధానాల కమిషన్ 2023 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఇతర పంటల సాగు ఖర్చు బాగా తగ్గడం, దిగుబడులు, రాబడులు పెరగడానికి ముఖ్య కారణం. తెలంగాణలో నువ్వుల తర్వాత వేరుసెనగ సాగు ద్వారా 120 శాతం, మొక్క జొన్న ద్వారా 50 శాతం రాబడి వస్తోంది. అయితే వరి సాగు ద్వారా వచ్చే రాబడి 46 శాతం మాత్రమే. సోయాబీన్ సాగు వల్ల 32 శాతం, కంది ద్వారా 23 శాతం, వేరుసెనగ సాగు ద్వారా 21 శాతం, పత్తి ద్వారా కేవలం 8 శాతం రాబడి వస్తున్నట్లు గత మూడేళ్ల పంటల పరిశీలనలో తేలింది. తెలంగాణ రైతులు తక్కువ సాగు ఖర్చయ్యే నువ్వులు, వేరుసెనగ వంటి పంటల సాగుమేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం వరికి పంట ఆరంభంలోనే కనీస మద్దతు ధరలు ప్రకటించి ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో సొమ్ము నేరుగా జమ చేస్తుండడం వల్ల అన్నదాతలు అధికాధికంగా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వరితో పోలిస్తే కంది, సెనగ వంటి వర్షాధార పంటల సాగు ఖర్చు తక్కువే. నీటిపారుదలతో కంది సాగు విస్తీర్ణం 4.5 శాతమే. ఈ పంటల దిగుబడులు పెరిగితేనే రైతుల లాభదాయకత పెరుగుతుంది. పుష్కలంగా నీరున్న ప్రాంతాలలో తప్ప ఇతర చోట్ల వరి సాగు చేసే భూములలో ఖరీఫ్ సీజన్‌లో సోయాబీన్, కంది, రబీ సీజన్‌లో సెనగ సాగును ప్రోత్సహిస్తే అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తన రకాలను సకాలంలో రైతులకు అందుబాటులో వుంచితే అన్నదాతల ఆదాయాలు పెరిగి వారి కళ్ళలో ఆనందపు వెలుగులు నిండుతాయి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వున్నపుడే భారత్ ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన కోసం తెచ్చిన ‘హరిత విప్లవం’,

వ్యవసాయ పరిశోధనా సంస్థలను ప్రోత్సహించి అధిక దిగుబడి విత్తన రకాలను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు కుటుంబాలకు చెందినవారే. తెలంగాణ వ్యవసాయ స్థితిగతులు తెలిసినవారే. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేయించి అనువైన పంటల సాగుకు అన్నదాతలను ప్రోత్సహించాలి. ప్రతి గ్రామ, మండలం, జిల్లాలలో అక్కడి నెలల భూసారం, అనువైన పంటలేవో శాస్త్రవేత్తలతో సర్వే చేయించి, వారి భూమి రికార్డులలో నమోదు చేయించి, కనీస మద్దతు ధరలు హామీ ఇస్తే రైతులు నువ్వులు, వేరుసెనగ, కంది, పండ్ల తోటలు, ఇతర పంటల సాగు చేపడతారు. సాగు నీరు పరిమితంగా ఉన్నచోట్ల బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహిస్తే, విదేశాలలో గిరాకీ వున్న పూల సాగును కూడా ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే అన్నదాతలు చెమటోడ్చి మెరుగైన దిగుబడులు సాధించి తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ మెరుగుదలకు, పల్లెల ముఖ చిత్రం మార్పుకు, సేద్యం దండగ కాదు పండగ అని నిరూపిస్తారు. అందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రభుత్వ కార్యాచరణ అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News