పుణెలో ఓ గ్యాంగ్ స్టర్ ని అతని సొంత ముఠా మనుషులే కాల్చి చంపారు. పుణెలో శరద్ మొహోల్ ఓ ముఠా నాయకుడిని శుక్రవారం అతని ముఠా సభ్యులే పాయింట్ బ్లాంక్ రేంజిలో దారుణంగా కాల్చిచంపారు. ఆ రోజు అతని పెళ్లి రోజు కావడం గమనార్హం.
మొహోల్ ను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు. మొహోల్ పలు హత్యకేసుల్లో నిందితుడు. ముఠా సభ్యుల మధ్య ఏర్పడిన డబ్బు, భూమి తగాదాలే మొహోల్ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పుణెనుంచి బయటకు వెళ్లే రోడ్లపై భద్రతను కట్టుదిట్టం చేశారు. పుణె-సతారా రోడ్డులో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. అదే వాహనంలో మూడు పిస్టళ్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు లభించాయి. మొహోల్ హత్యతో వీరికి సంబంధం ఉండి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.