మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్‌కు బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన పొంటూరు జయకు 2000 సంవత్సరంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌తో వివాహమైంది. వీరికి కుమారుడు పి.అఖిల్(21) ఉన్నాడు. అఖిల్ అమీర్‌పేటలోని సిద్దార్ధ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాడు. జయ భర్త 2018లో మృతిచెందాడు.
అప్పటి నుంచి జయ మోతీనగర్‌లో ఉంటుండగా అఖిల్ ఎల్లారెడ్డిగూడలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీన తాను శ్రీనగర్ కాలనీలోని స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పింది. అక్కడ ఉండగానే అఖిల్ తల్లికి వాట్సాప్‌లో బాయ్ మమ్మి లవ్ యూ, జాగ్రత్త అని మెసేజ్ పెట్టాడు. వెంటనే కుమారుడికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అక్కడి నుంచి వెంటనే ఇంటికి వెళ్లేసరికి మేయిన్ డోర్ లాక్ చేసి ఉంది.
వాచ్‌మెన్‌తో కలిసి డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అఖిల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే అఖిల్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. తన కుమారుడు మూడు నెలల నుంచి పబ్‌జీ గేమ్‌కు బానిసగా మారాడని, అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడంలేదని అఖిల్ తల్లి జయ చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.