Tuesday, November 19, 2024

మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతుసంఘం వినతి

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటల మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. శనివారం రైతుసంఘం నేతలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకుపోయారు.కాంగ్రెస్ ప్రభుత్వం తమ మ్యానిపెస్టోలో ‘రైతుల సమస్యల పరిష్కారం’ పై ప్రకటన చేశారని, మ్యానిఫెస్టోలో చేసిన హామీలను అమలు చేయాలని కోరారు.

భూమాత పథకం కింద భూమాతగా ప్రకటించిన ధరణిలోని లోపాలను సరిచేస్తామన్నారని ,  ధరణిలో 20 లోపాలున్నట్లు గత బిఆర్‌ఎస్ క్యాబినెట్ కమిటీ అంగీకరించిందన్నారు. వాటిని సరిచేయడానికి మీసేవ ద్వారా ప్రతి రైతు రూ.1650 చెల్లించారని, మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది డబ్బులు చెల్లించి ధరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూ సమస్యలపై గల లోపాలను సవరించి అందరికి పాస్‌పుస్తకాలు ఇవ్వాలని , సమగ్ర భూ సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరిపి లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతుల రికార్డు లకు సంబంధించి రెవెన్యూ రికార్డులలో కౌలు రైతుల పేర్లు , వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయుటకు రెవెన్యూ రిజిస్టర్‌లలో ‘కాలం’ను ఏర్పాటు చేయాలన్నారు. వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలని, 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలని, సాగుదారులందరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.12500 సబ్సిడీ ఇవ్వాలని కోరారు. పంటల బీమా పథకానికి సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుండి ‘కేంద్ర పిఎం ఫసల్ బీమా’ నుండి విరమించుకుందని తెలిపారు.

అప్పటినుండి రాష్ట్ర రైతులకు ఎలాంటి పరిహారం రావడంలేదని, ఏటా రూ.5,000 కోట్ల పంటలు నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రూపొందించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల పరిహారం ఇవ్వాలని కోరారు. సాగునీటి పథకాలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో సాగునీటి పథకాలను పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులను రానున్న ఎడాదిలో పూర్తి చేయాడానికి బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. కాళేశ్వరం సహా భారీ ప్రాజెక్టులలో జరిగిన అవినీతిని ‘హైకోర్టు జడ్జి’ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. సబ్సిడిపై మైక్రోఇరిగేషన్(డ్రిప్, స్పింక్లర్)పథకాలు అమలు చేయాలని తెలిపారు. ఐడిసి నిర్వహణలోని లిప్ట్ పథకాలను రిపెర్లు చేయాలని కోరారు.

కల్తీ విత్తనాలను అరికట్టాలని, రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కల్తీ విత్తనాల వ్యాపారం సాగుతుందని తెలిపారు. ఏటా 4,5 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయని, కల్తీ విత్తనాలను పట్టుకోవడమే తప్ప నేరస్తులపై ఏలాంటి శిక్షలు లేవన్నారు. వెంటనే ప్రభుత్వం ‘రాష్ట్ర విత్తన చట్టా’న్ని రూపొందించాలని, కల్తీ విత్తన సంస్థల కంపెనీలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించడంలో గత 2 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్‌పై ప్రకటన లేదని, వెంటనే వార్షిక ప్రణాళికలు ప్రకటించాలని కోరారు. ఈ ప్రణాళికలో ప్రాంతాల భూసారాన్నిబట్టి పంటల విధానాన్ని రూపొందించాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బరోసా పథకం ప్రకారం ఎకరాకు రూ.15,000 చోప్పున రైతుల ఖాతాలో వేయాలని, యాసంగి పంటలకు సంబందించి ఎకరాకు రూ.7500 చోప్పున వాస్తవ సాగుదారులందరికి వారి ఖాతాలలో జమ చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు, బోనస్ వెంటనే అమలు చేయాలన్నారు. వడ్లకు క్వింటాలుకు రూ.2683తో సహా మొక్కజొన్న తదితర పంటలకు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ధరలను వెంటనే అమలు చేయాలన్నారు. అందుకు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీలకు జిఓ విడుదల చేయాలని కోరారు.

లీటర్ పాలకు రూ.5 బోనస్ అమలుకు నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర స్థాయి ‘వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమీషన్’ ఏర్పాటు చేసి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని మంత్రికి విజ్ణప్తి చేశారు. రూ.2లక్షల లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, రిజర్వుబ్యాంక్ ఆదేశాల ప్రకారం బ్యాంకులు తమ డిపాజిట్లలో 18 శాతం ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని,అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం అర్హులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు.మూసివేసిన చెరుకు ప్యాక్టరీలను తెరిపించుటకు చర్యలు ప్రారంభించాలని తెలంగాణ రైతుసంగం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ , ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు ,సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌తదితరులు మంత్రి తుమ్మలకు విజ్ణప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News