సంతృప్తినిచ్చిన నెల రోజుల ప్రస్థానం
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేస్తా
నెల రోజుల పాలనపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నెల రోజులు గడిచిన నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా బాధ్యతను నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి ఈట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన’ ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు.
పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగామన్నారు. అన్నగా నేనున్నానని ప్రజలకు హామీ ఇస్తూ, జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందంటూ రేవంత్‌రెడ్డి వివరించారు. పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ నడిచామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాలక్ష్మీల ముఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు కొనసాగుతోందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి, పెట్టుబడులకు కట్టుబడి ఉంటామని మరోమారు చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడికి పూర్తిగా కృషి చేస్తామన్నారు. నెలరోజుల పాలన నిజాయతీగా సాగిందన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024