Friday, December 20, 2024

కవిత్వపు కళ్లల్లో మెరుస్తున్న ‘చాంద్’, జాబేర్ పాషా

- Advertisement -
- Advertisement -

నా దృష్టిలో కవిత్వమనేది ఒక కళాత్మక క్రియ,/ లోలోపలి సంఘర్షణను వ్యక్తపరిచే సాధనం…/ మనతో మనం మౌనంగా చేసే ఆత్మ సంభాషణ…/ ఒంటరితనంలోంచి రగిలే అనేక భావాల సమూహం…/ మనం చూస్తున్న /అనుభవిస్తున్న జీవితాన్ని లయాత్మకంగా వర్ణించగలిగే నేర్పు…కవి రాసిన అక్షరాల్లో, పాఠకుడు దృశ్యాన్ని చూడగలగడం ఒక గొప్ప అనుభూతి…../ అలాంటి రచనలు ఎక్కువ మన్ననలు పొందే ఆస్కారముంటుందని భావిస్తాను…./ కవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సునిశితంగా పరిశీలిస్తూ, ప్రతిస్పందనగా తన భావోద్వేగాలను సృజనాత్మకంగా ప్రకటిస్తుంటాడు…./ సామాజిక చైతన్యాన్ని కలిగించడం కవి ప్రథమ బాధ్యతగా నేను పరిగణిస్తాను../ ఒకప్పటి కవిత్వం సంక్లిష్టతతో కూడుకుని, కవులకు మాత్రమే అర్ధమయ్యే విధంగా ఉండేది, ఇప్పుడు వీలైనంత సరళంగా మారి సామాన్య పాఠకులను సైతం అలరిస్తోంది అని నమ్ముతున్న కవి జాబేర్ పాషా. పత్రికల్లో ఈ పేరు మనం చూస్తూ ఉంటాము. తానేం రాస్తున్నాడో, ఎలా చెప్పాలని భావిస్తున్నాడో, ఆ వాక్యం ఎలా ఉండాలో , ఆ వాక్యం పాఠకులలోకి ఎలా వెళ్లాలో స్పష్టమైన చూపు తో పాషా కవిత్వం అవుతున్నాడు.
నేనో కవిత చదువుతున్నప్పుడు మొదటి వాక్యం నన్ను లోపలకి తీసుకెళ్లాలి అని భావిస్తాను.

/ ప్రారంభంలోనే ఆ కవి వాడిన భాష, కవితని వ్యక్తీకరిస్తున్న తీరు నాలోని పాఠకుడికి అడ్డుతగిలితే ఆ కవితను నేను నిర్లక్ష్యం చేస్తాను. పొట్టకూటి కోసం మస్కట్, దుబాయ్, కువైట్లో ఉండి,వలస బతుకులు బతికే అల్ప జీవుల జీవితాన్ని గురించి తెలుగు సాహిత్యంలో మంచి కథలు ఉన్నాయి. ఆ వలస దుఃఖాన్నిఆవిష్కరించిన కవితలు తక్కువ అనే చెప్పాలి. సముద్రాలకి అవతలి ఉన్న దుఃఖాన్ని తన అక్షరాల్లో పాషా ఆవిష్కరించాడు. ప్రత్యక్షంగా ఆ దుఃఖాన్ని చూస్తున్నవాడు, అక్కడి వలస జీవితం తెలిసినవాడు కనుక, తను రాసిన అక్షరాలు మన కంట్లోంచి కన్నీటి చుక్కలుగా రాలుతాయి. అంటే నా ఉద్దేశం ఇక్కడ దుఃఖం ఒక్కటే కవిత్వం అని కాదు. తాను రాసిన అక్షరాలు చదివి,ఆ దుఃఖంలో మనం కూడా భాగం అవుతున్నామంటే , ఆ కవి పాఠకుడి లో నిలుస్తున్నాడు. ఈ వస్తువే కాకుండా అనేక వస్తువుల నేపథ్యం లో కవితలు అల్లుతున్నాడు. మనలోకి వెళ్తున్నాడు.

కవిత్వంలో కవి ఏం చెప్పదలుచుకున్న అది కవిత్వమే కావాలి .అలా కావడానికి టెక్నిక్ ప్రధానం. అయితే ఆ టెక్నిక్ తెచ్చి పెట్టుకున్నట్టు ఉండకూడదు తనకు తానుగా కవిత రూపొందాలి. కవిత్వం నా కోసం వేచి చూడమని కవికి చెప్తుంది ,అది వినగ గలిగిన కవి పాఠకుడిని అసంతృప్తికి గురిచేయడు . పాఠకుడు దగ్గర కవి తలెత్తుకోవాలంటే పాఠకుడు తల దించి కవిత్వంలోకి వెళ్లాలి .ఒక్క ఉదుటన చదివాక తల పైకెత్తి ఊపిరి పీల్చడమో, వదలడమో చేయాలి. జాబేర్ రాసిన అమ్మీ జాన్ చదివాక నాకు అలానే అనిపించింది. ఈ కవిత ఎత్తుగడ నుండి ముగింపు వరకు మనల్ని చదివిస్తుంది .అబ్బు ఎడారి పాలయ్యాక తన బతుకులో అమ్మ ఎలా ఒయాసిస్ అయిందో కవి చెప్పిన వాక్యాలు మనకు కూడా ఎరుకులోకి వస్తాయి. రక్తాన్ని కదిలిస్తాయి .ఈ కవితలో వాడిన పదాలు దళిందరాగి ,సుర్మా ,ఈద్, చాంద్, నఖాబ్ ఫజర్ ,ఈదీ ఇషా ,దువా ,మన్నత్, జన్నత్ కబూతర్ లాంటివి తెలుగు పదాలు కావు .అయినా అవి ఏమీ నన్ను అడ్డుకోలేదు.

నఖాబ్ వెనుక కొన్ని దుఃఖ నదులు/ పుట్టి ప్రవహిస్తూ/ మదిలోని బాధ ఏ అర్ధరాత్రో/ బొట్లుగా రాలి దిండుకు తలబాదుకుని/ మరణిస్తుంది/ ‘ఇషా నుండి ఫజర్ మధ్యలో అమ్మిజాన్/ ఓ రెక్కలు తెగిన దేవదూతలా కనిపించేది /విలపించేది/ ఈ కవితలో గమనిస్తే కనిపించేది వరకే ఆగి ఉంటే అదో లెక్క. విలపించేది అని రాయడం ఈ కవి చేసిన కొత్త లెక్క. వాళ్ల నాన్న తిరిగి వచ్చాక అదే వారసత్వపు వలస రెక్కలను తొడుక్కొని నునుపు అయిన దూరపు కొండలపై కవి వాలాల్సి వచ్చింది. ఇప్పుడు/ నేను లేని అమ్మీ జాన్/ నెలవంక లేని ఆకాశమై ఒక్కోతారను/ కన్నీటి బొట్లుగా రాల్చుకుంటోంది’ (వివిధ, ఆంధ్ర జ్యోతి నవంబర్ 15, 2021).మస్కట్ లోని వలస మనుషుల బ్రతుకులను ఆవిష్కరించిన కవిత పంచరంగుల పంజరం .ఈ కవితలో వాడిన పదాలు, వాక్య నిర్మాణం వలస బతుకుల్ని ,ఆ బాధల్ని ,తెగిన రెక్కల దుఃఖాన్ని ,మొలిచే రెక్కల పై ఎదురుచూసే క్షణాల్ని ,అక్కడి ఆత్మల్ని మన కంటి ముందు నిలుపుతాయి. ఇల్లు విడిచిన దుఃఖాన్ని మన కంటి ముందు నిలుపుతాడు./ “పంచరంగుల పంజరం‘ నుండి/ బాహ్య ప్రపంచాన్ని వీక్షిస్తూ,/ విడిచిన చెట్టును, వదిలిన గూడును/ కలగంటూ రాత్రుళ్ళు ఉలిక్కిపడి లేస్తుంటారు…./ పొద్దంతా పరకా, పరకా పేర్చి,/ నింగినంటే గూళ్లను నిర్మిస్తారు,/ సొంత గూటి కోసం ఒక్క పుల్లకైనా నోచుకోరు…. / తప్పుకో రాయి చొప్పున గులేర్ దెబ్బల రుచి చూస్తూ,/ పొద్దున్నే పుట్టి, సాయంత్రానికల్లా మరణించిన ఆత్మలను,/

మోసుకుంటూ ‘క్యాంప్‘ గుమ్మంలోకి అడుగుపెడతారు, / తెగిన రెక్కలతో ఎగరలేక,/ మొలిచే రెక్కలకై ఎదురుచూస్తూ…./ తిరిగి పచ్చని చెట్టుపై వాలే పిట్టలు కొన్నైతే,/ అలసి పరాయి గట్టుపై రాలే పిట్టలు మరికొన్ని.‘…( పంచ రంగుల పంజరం, వివిధ , ఆంధ్రజ్యోతి, జూలై 7, 2022 )హిందూ ,ముస్లిం ఐక్యత పల్లెల్లో ఎలా ఉండేదో ,విషపు గాలులు ఎలా చొరబడుతున్నాయో ,రెండు హృదయాల గోడలు బీటలు వారడానికి గల కారణాలు ఏమిటో చేతుల్లోకి గునపాలు ఎలా వస్తున్నాయో, అగర ధూపం / ఊదుపొగ కవితలో చాలా సరళంగా చెప్తూనే , ఆ మనసు లోని భారాన్ని మనకు పంచుతాడు .కవిత్వంలో స్వీయ అనుభూతులు, దుఃఖము కాకుండా ఉంటే, ఇవి కవిత్వం కాదని కొందరు అంటారు. గతాన్ని తవ్వుకోవడం ,మూలాల అన్వేషణని పెద్దగా పట్టించుకోనవసరం లేదని కొందరు అంటారు. అయితే ఈ కవి సామాజిక విధ్వంసం వ్యవస్థాగత హింసల మీద రాజ్యం చేసే కుట్రల మీద కూడా ప్రతిస్పందించాడు. దేశంలో అనేక రాజకీయ సాంఘిక సాంస్కృతిక మార్పులు జరుగుతున్నాయి అవి దేశం నుండి వీధి వరకు వీధి నుండి వ్యక్తి వరకు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కొక్కవిలో ఒక్కో నిర్మాణ క్రమం ఉంటుంది.

ఆ నిర్మాణ క్రమాన్ని కవిత తెచ్చుకోవాలి .కవి తెచ్చుకోకూడదు. కవిత్వంలో ఉపన్యాసాలు కుదరవు, నీతి వాక్యాలు అక్కర్లేదు. ఒక దృశ్యమో,సంఘటనో, ఒక వస్తువో కవిత్వం కావాలంటే వెదురు బద్దను రెండుగా చీల్చుకున్నట్లు ,కవి తనని తాను చీల్చుకోవాలి. కొందరు కవులు కొట్టు వచ్చినట్టు చెక్కుడుతనం కనిపిస్తుంది ఆ చెక్కుడులో శిల్పమే కనిపిస్తుంది గాని కవిత కొంత కోల్పోతుంది కవి ముందు పాఠకుడు కావాలి. అప్పుడే తన వైఫల్యాలు తెలుస్తాయి. ‘అగర ధూపం ఊదు పొగ‘ కవితలో పాఠకుడు అయిపోయిన కవిని మనం గమనించవచ్చు. అగరు ధూపం ఊదుపొగ మిళితమైన పరిమళంలోకి గుర్తుకొచ్చిన కల్మషం గురించి ఈ కవి దిగులు చెందాడు. పాలు, సేమ్యా కలగలిసిన కమ్మదనం గొంతు నుండి దూరమౌతున్న వైనాన్ని గుర్తుపట్టమంటున్నాడు. ఒకరి ఇంటి ముందు ఒకరు పందిరి గుంజల్లా బతికిన మనుషుల మధ్యలోకి దూరిన చెదపురుగుని గురించి కలత చెందుతున్నాడు. శత్రువుని గుర్తించమంటూనే ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం గురించి కూడా కవి ప్రేమగా చెబుతున్నాడు.

‘ఉంటరు…/ తేనెతెట్టె పైకి రాళ్లు విసిరి తేనెటీగలదే తప్పనేటోళ్లు,/ పెదాలపై పూసిన మల్లెల్ని తెంపి మాయమాటల దండలల్లి మెడలో వేసేటోళ్లు,/ ఆ దండల్ని, పెట్టే దండాల్ని చూసి ఆగమవకురా నేస్తమా….! ‘/ ‘నిజంగా/ వాళ్ళు చెప్తున్నంత, నువ్వనుకుంటున్నంత,/ కయ్యమేం లేదు మన మధ్య…./ తాతల పగనో, తండ్రుల వైరాన్నో వారసత్వంగా పంచుకోలేదు మనం ‘/ ‘ ఇదిగో నీకిష్టమని,/ పెద్దగుట్ట పీర్ల మలీద ముద్దలు తెచ్చిన./ ఎప్పటిలాగే ఎల్లమ్మ పండుక్కు పిల్చి ఇస్తరాకేసి చేయి కడిగిస్తవ్ కదూ….?!‘/ ‘ద్వేషానికి నానార్థాలు వెతికింది చాలు,/ ఇక ప్రేమకు పర్యాయపదమై బ్రతుకుదాం….‘ ( అగర ధూపం ఊదు పొగ-9.1.23, ఆంధ్రజ్యోతి, వివిధ).తెలంగాణ మాండలిక పదాలు, సజీవమైన భాషని కవితలో వాడుకోవడం, కొత్త భావనలను కలిగించడం, అభివృద్ధిలో నూతన మార్గాన్ని అన్వేషించుకోవడం ఈ కవి లో మనం చూడవచ్చు. ఒక్క మాట మనిషిని ఎలా బాధిస్తుందో పాషా ఓ కవితలో చెప్పిన విధానం చాలా బాగుంది. మనసు పొదల్లో దాగి మాటేసే మాటల పట్ల జాగ్రత్తగా ఉండమంటాడు .ఈ కవి బాధాతప్త హృదయాలకు ఓదార్పు వాక్యాన్ని ఇవ్వగలడు. ‘నిద్రలేని రాత్రి‘ అనే కవిత కూడా వస్తువు పాతదే అయినప్పటికీ వ్యక్తీకరించిన తీరు లో తాజాతనం ఉంది.

చేపల చెరువుకు కాపలా కాసే కొంగల్ని, ఆకుపచ్చ వనంలో చిచ్చు రేపేశత్రువుల్ని, కండువాలను మార్చే కపటకపోతాల పట్ల జనం ఎంత జాగూరు కథతో ఉండాలో హెచ్చరిస్తాడు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో రాసిన కవిత మృగం. ఇందులో చాలా స్పష్టంగా అడవిని దహించేందుకు సిద్ధమైన మృగాన్ని మనకు కవి చూపుతాడు. పచ్చని అడవిలో పిచ్చి పట్టిన మృగాల పచ్చి నెత్తుటి కంపు అనడం ద్వారా ఆ ఘటన తాలూకు సీరియస్ నెస్ ని చెప్తాడు.అలాగే ఈ కవిత్వంలో గమనించదగిన మరో అంశం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఈ కవి తన కంటితో బయట ప్రపంచాన్ని చూస్తున్నవాడు. మనసుతో అంచనా వేసుకుంటూ లోపలి నుంచి కవిత్వంగా మాట్లాడడాన్ని మనం గమనించవచ్చు. బహిర్ ప్రపంచాన్ని లోపలికి తీసుకొని తన మాటలుగా కవిత్వాన్ని అల్లుతున్నాడు. లోపల బయట సరిగ్గా గమనించడం కవిని శక్తిమంతుడిని చేస్తుంది. ఆ ఎరుక జాబేర్ లో స్పష్టంగా మనం చూడవచ్చు. ‘నేర్చుకోవాలి‘ అనే కవితలో కోడిపిల్లలా మారి తప్పించుకున్నంత కాలం,/ బ్రతుకు వేటకుక్కై తరుముతూనే ఉంటుంది,/ చిక్కి మరణించడం కాదు,/ తెగించి ప్రతిఘటించడం నేర్చుకోవాలి…. (సాక్షి, ఫన్ డే) ఈ నాలుగు వాక్యాలు పరిశీలిస్తే జీవితం పట్ల అతనికి ఉన్న అవగాహన మనకు తెలిసిపోతుంది.

కటికి చీకటిలో ఉన్న కాలంలోకి వెలుగుని ఎలా తెచ్చుకోవాలో నేర్చుకోమంటున్నాడు. జీవితం లో వచ్చే కష్టాలను ఎలా ఎదిరించాలో ఇలా చెప్తున్నాడు./ సులువుగా ఈదేస్తే సముద్రాల విలువేంటి…..?/ అందుకే సుడిగుండాల్ని సృష్టిస్తుంటాయి…/ ముంచెత్తే అలల్ని చూసి జడుసుకోవద్దు,/ ఒడ్డుకు చేర్చే తర్కాన్ని ఒడిసిపట్టడం నేర్చుకోవాలి…/ ఈ కవిత కవిత్వంలో క్లుప్తత, ఆప్తత ,గుప్తత ఎంత ప్రధానమో తెలుపుతుంది .అయితే పాషా ఇంకా పుస్తకంగా మన ముందుకు రాలేదు. ప్రస్తుతం అతని కవిత్వానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతను ఏం రాస్తున్నాడో ,ఎలా రాస్తున్నాడో గమనిస్తూ ఉన్నారు. జాబేర్ కవిత్వానికి ఉద్వేగం చాలా ప్రధానమైన బలం. అతని కవితలు కొన్ని చదివినప్పుడు కళ్ళల్లో నీటి పొరలు కదలాడుతాయి. అలాగే శత్రువును గుర్తించే లక్షణం కూడా ఉంది. ఒక దృక్పధం ఉంది. పాషా మనల్ని త్వరలో ఒక పుస్తకంగా పలకరిస్తాడని ఆశిస్తున్నాను…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News