Sunday, December 22, 2024

ఆరు గ్యారెంటీల అమలుకు క్యాబినేట్ సబ్ కమిటీ

- Advertisement -
- Advertisement -

అభయహస్తంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ
అందులో 20 లక్షలు భూ సమస్యలు, రేషన్‌కార్డుల దరఖాస్తులు
ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు కంప్యూటర్‌లో నమోదు
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం
సబ్ కమిటీ విధానాలు రూపొందించిన తరువాత లబ్ధిదారుల ఎంపిక
ప్రభుత్వంపై విపక్ష పార్టీ నేతలు అడ్డగోలుగా విమర్శిస్తే సహించేదిలేదు
రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పథకాలు దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, తనను నియమించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం ప్రజాపాలన తదుపరి కార్యచరణపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విధివిధానాలు కేబినెట్ సబ్ కమిటీలో రూపొందించి తరువాత మంత్రివర్గ భేటీలో చర్చిస్తామన్నారు.

రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన అర్హులు ఉంటే తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారని అయినా దరఖాస్తుల డేటా ఎంట్రీ కొనసాగిస్తామన్నారు. ప్రతి గ్రామం, తండా నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించామని, ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. దరఖాస్తు కేంద్రాల్లో ఎలాంటి గొడవలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో దరఖాస్తులు తీసుకోవడం అధికారులు పనితీరుకు నిదర్శమన్నారు.

అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు, భూ సమస్యలు, రేషన్‌కార్డులకు ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అతి తక్కువ సమయంలో విజయవంతంగా 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించామని, ప్రతిపక్ష పార్టీ నాయకులు 40 రోజుల్లో హామీలు ఎలా నెరవేరుస్తారని విమర్శిస్తుంచడం సరికాదన్నారు. తాము ఎప్పుడు 40 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ప్రకటన చేయలేదని, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతోంది. ఈ నెల 30 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందని వెల్లడించారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని, ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కుండ బద్దలు కొట్టారు.

దరఖాస్తుల డేటా వేగంగా నిర్వహస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 30 వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేస్తాన్నామన్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పథకాలు అమలు కాలేదని నెల రోజులకే ప్రతిపక్షనాయకులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ వారు అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పాలకులు అబద్దాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపి, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు. స్వేద పత్రం తరువాత సౌదపత్రం తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. 32 మెడికల్ కళాశాల బదులు 32 వాట్సాప్ యూనివర్శిటీలను పెట్టాల్సిందని, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేసి విశ్వసనీయతను కోల్పోయారని ఎద్దేవా చేశారు.

Ponnam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News