మల్లు భట్టి మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి : కెటిఆర్ హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘‘ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా… ఎవరికీ మీ ఓటిపి, బ్యాంక్ వివరాలను షేర్ చేయకండి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి’’ అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ప్రజాపాలన దరఖాస్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇందుకు సంబంధించి వీడియోలను చూస్తున్నానని, అలాగే పలువురి నుంచి వింటున్నానని పేర్కొన్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు పత్రాలలో కోట్లాది తెలంగాణ ప్రజల సున్నితమైన డేటా ఉందని గుర్తుచేశారు.
ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ప్రియమైన తెలంగాణ సోదర, సోదరీమణులారా ఎవరైనా మీకు పెన్షన్ లేదా ఇల్లు లేదా ఆరు గ్యారంటీలలో ఏదైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటిపిని లేదా బ్యాంకు వివరాలను షేర్ చేయవద్దని హెచ్చరించారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. ‘మీరు బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేశారా? లేదా ఇతర పార్టీకి వేశారా? అనే దాంతో సంబంధం లేదు. కానీ సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటలను తీవ్రంగా పరిగణించండని’ విజ్ఞప్తి చేశారు. తద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని సూచించారు.
I've been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUr
— KTR (@KTRBRS) January 9, 2024