Saturday, November 23, 2024

న్యాయ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ బానో కేసు యావజ్జీవ ఖైదీలు 11 మందినీ చట్టం కళ్ళుగప్పి అడ్డదారులు తొక్కి బిజెపి పాలకులు విడుదల చేయించిన తీరు ఎంత జుగుప్సాకర మైందో స్పష్టం చేస్తూ జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. రాజ్యాంగం, చట్టం దేశ పౌరులకు హామీ ఇస్తున్న మానవీయ న్యాయాన్ని పునరుద్ధరించిన తీరు కొనియాడదగినది. ఈ 11 మంది క్షమాభిక్షను రద్దు చేయడం ద్వారా ధర్మాసనం ఒక పెద్ద అన్యాయాన్ని సరిదిద్దింది. పాలకులు ప్రజల తరపున కాకుండా ప్రజాకంటకుల వైపు నిలబడి గుజరాత్ ఎన్నికలకు ముందు దోషులకు శిక్ష నుంచి విముక్తి కలిగించిన తీరును చీల్చిచెండాడింది. దోషులు రెండు వారాల్లోగా లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించడం ద్వారా చట్టబద్ధ పాలనకు మళ్ళీ పట్టం కట్టింది.

ఈ ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడానికి అనుమతించిన కేంద్ర ప్రభుత్వాన్నీ ధర్మాసనం తప్పుపట్టింది. సుప్రీం కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం ద్వారా ఈ అన్యాయమైన విడుదలకు ప్రభుత్వాలే దారి చేసిన దుర్మార్గం దేశ న్యాయ చరిత్రలోనే ఎప్పుడూ సంభవించి ఉండదు. 2002లో ఘాతుక గోధ్రా రైలు బోగీ దగ్ధం తర్వాత సంభవించిన గుజరాత్ అల్లర్ల మారణకాండ నుంచి తప్పించుకోడానికి పారిపోతున్న సమయంలో గర్భవతి అయిన బిల్కిస్ బానోను అడ్డగించి ఆమె మూడేళ్ళ కుమార్తెను మరి ఆరుగురు కుటుంబ సభ్యులను దుండగులు హతమార్చారు. అంతటితో ఆగకుండా బానోపై సామూహిక అత్యాచారానికి తలపడ్డారు. సాక్షులను వేధింపులకు గురి చేసి వాస్తవాలను తారుమారు చేస్తారనే భయంతో ఈ కేసును సుప్రీం కోర్టు గుజరాత్ నుంచి ముంబయికి 2004 ఆగస్టులో బదిలీ చేయడం, సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులు 11 మందికీ 2008 జనవరిలో యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది.

శిక్షలు వేసింది మహారాష్ట్ర సిబిఐ స్పెషల్ కోర్టు, వాటిని ధ్రువపరిచింది ముంబై హైకోర్టు కాబట్టి శిక్షను తగ్గించి ముందుగా విడుదల చేయాలనే రెమిషన్ పిటిషన్‌ను విచారణకు చేపట్టే అధికారం కూడా మహారాష్ట్రకే ఉంది. ఇందుకు విరుద్ధంగా దోషుల్లో ఒకరైన రాధేశ్యాం భగవాన్ దాస్ షా 1992 జులై నాటి పాత గుజరాత్ ప్రభుత్వ విధానం ప్రకారం తన రెమిషన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని గుజరాత్‌ను ఆదేశించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అందుకు జస్టిస్ అజయ్ రోస్తగి ధర్మాసనం అనుమతి ప్రసాదించింది. మారిన చట్టం ప్రకారం శిక్షపడిన రాష్ట్రంలోనే రెమిషన్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉందని గుజరాత్ హైకోర్టు గతంలో స్పష్టం చేసిన వాస్తవాన్ని కప్పిపుచ్చి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారని, ఆ విధంగా కాలం చెల్లిన పాలసీని ప్రయోగించి సుప్రీం ధర్మాసనం అనుమతి పొంది గుజరాత్ ప్రభుత్వం వీరికి క్షమాభిక్ష సాధించిందని ఇది ఎంతమాత్రం చెల్లదని జస్టిస్ నాగరత్న వివరించారు.

వాస్తవాలను కప్పిపుచ్చడం ద్వారా, ద్రోహ చింతన ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం రెమిషన్‌ను సాధించుకొన్న చేదు వాస్తవాన్ని సుప్రీం కోర్టు బహిర్గతం చేసింది. బిజెపి పెద్దల్లో రాజ్యాంగ న్యాయం పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకొన్నదో వెల్లడవుతున్నది. చట్టానికి లోబడి ఉండే ప్రతి ఒక్కరూ ఆ విధాన వ్యవస్థకు లోబడి జీవించాలని, అందులో విఫలనైనవారిపై న్యాయ దండం విరుకుపడుతుందని ధర్మాసనం చేసిన హెచ్చరిక గమనించదగినది. అయితే ఇంత ద్రోహానికి పాల్పడిన పాలకులకు కనీస సంకేతాత్మకమైన జుల్మానా వంటిది విధించి ఉంటే బాగుండేది. యావజ్జీవ శిక్షల విషయంలో 14 సంవత్సరాల పాటు శిక్ష అనుభవించిన తర్వాతనే రెమిషన్ దరఖాస్తు పెట్టుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దోషులు అడ్డదారిలో విడుదల అయినప్పుడు వారికి విశ్వహిందూ పరిషత్తు కార్యకర్తలు వీరోచిత స్వాగతం ఇచ్చారు.

అంటే వారు బిల్కిస్‌పై జరిగిన అమానుషాలను హర్షిస్తున్నారనే కదా! చట్టబద్ధ పాలన కొద్ది మందికి రక్షణ కల్పించడానికి కాదని, తమ స్వార్ధం కోసం ఇతరులను హతమార్చే వారిని అదుపులో పెట్టడానికేనని, న్యాయ స్థానాలున్నవి న్యాయం చేయడానికే గాని న్యాయాన్ని హరించడానికి కాదని చెప్పడం ద్వారా ఇటువంటి దొంగ దారి పద్ధతులను సహించబోమని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. గర్భవతిగా ఉండగా బిల్కిస్ బానోపై, ఆమె కుటుంబం మీద జరిగింది మత విద్వేషంతో సాగించిన అమానుషకాండ అని చెప్పింది. తద్వారా జస్టిస్ నాగరత్న గుజరాత్ బిజెపి పాలకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. మహిళ ఎంత ఉన్నత లేదా మరెంత హీన స్థాయికి చెందినప్పటికీ ఆమెను గౌరవించి తీరాలని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం శిరోధార్యమైనది. మహిళలపై నీచమైన నేరాలకు పాల్పడిన వారు రెమిషన్‌కి అర్హులేనా అని అది వేసిన ప్రశ్న పాలకుల్లో అణగారిన మానవత్వాన్ని తట్టి లేపాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News