Saturday, November 23, 2024

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రూ. 10 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలెప్‌మెంట్ నిధులు కేటాయిస్తున్నామని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను ఆ యా జిల్లాల నాయకులు అభివృద్ధి చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిఎం సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో మంగళవారం నాడు ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎంఎల్‌ఎలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల గెలుపు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ  నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని, అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని సిఎం హితవు పలికారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.

త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News