Friday, December 20, 2024

మరిన్ని స్థానాలపై బిజెపి గురి

- Advertisement -
- Advertisement -

50 శాతానికి మించి ఓట్లు సాధించడమే లక్షం
2024 లోక్‌సభ ఎన్నికలపై బిజెపి వ్యూహం

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పుంజుకున్న ఆత్మవిశ్వానంతో ఉన్న భారతీయ జనతా పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికలలో అధిక స్థానాలలో పోటీ చేసే అకకాశం ఉంది. ఈ నెలలోనో లేక వచ్చే నెలలోనో లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. మొదటి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా పేర్లను బిజెపి ప్రకటించే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పేర్లను మొదటి జాబితాలోనే బిజెపి ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలిచిన లేదా తృటిలో ఓటమి పాలైన 164 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను మలి విడత జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. అంతేగాక అదనంగా మరి కొన్ని స్థానాలలో కూడా పోటీ చేసే విషయాన్ని బిజెపి తీవ్రంగా పరిశీలిస్తోంది. గత రెండేళ్లుగా ఈ క్లిష్టమైన సీట్లపైనే బిజెపి గురిపెట్టి పార్టీ బలోపేతానికి చురుకుగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 543 స్థానాలలో 436 స్థానాలలో పోటీ చేసింది. వీటిలో 303 పీట్లను గెలుచుకుని 133 స్థానాలలో ఓటమిపాలైంది. వీటితోపాటు మరో 31 ఇతర బలహీన నియోజకవర్గాలపై కూడా బిజెపి దృష్టి పెట్టింది. దీంతో మొత్తం 164 స్థానాలపై ఫోకస్ పెట్టిన బిజెపి వీటి బాధ్యతలను అమిత్‌షాతోసహా కొందరు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించింది. ఈ నియోజకవర్గాలను సి, డి గ్రూపులుగా బిజెపి విభజించింది. మొత్తం 45 మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి మూడు స్థానాలను చూస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే మిత్రపక్షాల సంఖ్య తగ్గిపోవడంతో మరికొన్ని రాష్ట్రాలలో కూడా పోటీ చేయాలని బిజెపి ఆలోచిస్తోంది.

గత ఎన్నికలలో పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్, బీహార్‌లో జెడియు, మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో ఎఐఎడిఎంకె, రాజస్థాన్‌లో ఆర్‌ఎల్‌పితో బిజెపి పొత్తు పెట్టుకుంది. దీంతో ఆ రాష్ట్రాలలో బిజెపి తక్కువ స్థానాలలో పోటీ చేయాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 16 స్థానాలలో బిజెపి ఓటమి పాలుకాగా వాటిలో 14 బలహీన స్థానాలను బిజెపి గుర్తించింది. మొదటి జాబితాలోనే రాయ బరేలి, మెయిన్‌పురి, బిజ్నోర్, సహరన్‌పూర్, సంభల్, మురాదాబాద్, ఘాజీపూర్, జాన్‌పూర్, రాంపూర్, ఆజంగఢ్, నగీనా, అమ్రోహ, అంబేద్కర్ నగర్, ష్రవస్టి, ఘోసి, నాల్‌గంజ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని బిజెపి యోచిస్తోంది. వీటిలో కొన్ని సమాజ్‌వాది పార్టీకి కంచుకోటలు కాగా వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా స్థానంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు గతంలొ మంచి పట్టు ఉండగా ఇప్పుడు ఆ స్థానంపై బిజెపి దృష్టి పెట్టింది. అక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. కేరళలోని త్రిసూర్, తిరువనంతపురం, తన్మతిట్ట వంటి నయోజకవర్గాలలో బిజెపి పోటీచేయనున్నది. త్రిసూర్ నుంచి సినీ నటుడు సురేష్ గోపిని బిజెపి రంగంలోకి దించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని బారామతి, బుల్ధానా, ఔరంగాబాద్, పంజాబ్‌లోని అమృత్‌సర్, ఆనంద్‌పూర్ సాహిబ్, భటిండ, గుర్దాస్‌పూర్‌పై బిజెపి ఫోకస్ పెట్టింది.

పంజాబ్, మహారాష్ట్ర, బీహార్‌లో పొత్తుల కోసం చర్చలు జరుగుతుండగా కొన్ని నిర్దిష్టమైన స్థానాలలో సీట్ల సర్దుబాటు పరిశీలనలో ఉంది. కాగా&70 ఏళ్లు పైబడిన ఎంపీలకు లేదా మూడు సార్లకు మించి ఎన్నికల్లో గెలిచిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని బిజెపి యోచిస్తోంది. కొత్తవారికి ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నది బిజెపి ఆలోచనగా కనపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లను సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్షం పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News