Sunday, November 24, 2024

కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది: కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన ఆ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేవారు. ఉద్యమాలు బిఆర్‌ఎస్ పార్టీకి కొత్త కాదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశ అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్ మాత్రమే అని, కెసిఆర్ మళ్లీ రాష్ట్రానికి సిఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినా, ఆ లోపు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో కష్టపడి చేద్దాం, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించుకుందామని పార్టీ శ్రేణులను కోరారు.

గ్యారంటీల అమలులో అనుమానాలున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతూనే ఉంటామని కడియం శ్రీహరి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ గ్యారంటీల అమలులో అనుమానాలు ఉన్నాయని, కర్ణాటకలో సిఎం సిద్దరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి అక్కడ గ్యారంటీల అమలు సాధ్యం కాదని అన్నారని గుర్తు చేశారు. గ్యారంటీల్లో కోతలు తప్పవని ఆయన హెచ్చరించారని తెలిపారు. కర్ణాటక తరహా పరిస్థితే తెలంగాణలో ఉంటుందని తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. గ్యారంటీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారో సిఎం గానీ, డిప్యుటీ సిఎం గానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతుబంధు కావచ్చు వడ్లకు బోనస్, 200 యూనిట్ల కరెంట్, మహాలక్ష్మిపథకం ఇలా ఏ పథకంపై స్పష్టత లేదని విమర్శించారు. వీటి అమలుకు ఒక షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలయాపన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి తాము తొందరపడుతున్నారు అంటున్నారని,కానీ ఆయనే ఎన్నికల ముందు తేదీలు చెప్పారని, వాటి ప్రకారం ముందుకు వెళ్ళండని అన్నారు.

ప్రజల పక్షాన మాత్రమే ప్రశ్నిస్తున్నాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తమకు అక్కసు లేదని, తాము ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ప్రజల పక్షాన మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, వారికి వచ్చే సాయాన్ని ఆపడం ఎంత వరకు సమంజసమో దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని కోరారు. గృహలక్ష్మి విషయంలోనూ లబ్దిదారులకు అన్యాయం చేయొద్దని, ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రాలు ప్రకటించాలని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో పెట్టారని, రాజకీయ సమావేశాలు ఆ సంస్థలో పెట్టవచ్చా..? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కండువాలు కప్పితే ఆనాడు కెసిఆర్‌ను తప్పుపట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 కోట్ల రూపాయల ఖర్చు భాధ్యతను ఇంచార్జ్ మంత్రుల చేతిలో పెట్టడం సరికాదని సూచించారు. కేవలం కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకే ప్రభుత్వ నిధులు ఇవ్వాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా వన్ నిధులు దుర్వినియోగమైతే విచారణ చేసుకోవచ్చని, కానీ ఫార్ములా వన్‌ను రద్దు చేయడం సరికాదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

మళ్లీ పుంజుకుని ముందుకు సాగుదామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు
వరంగల్ లోక్‌సభ నియోజక వర్గ సమీక్ష సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని, వెయ్యిమంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గోని విలువైన సూచనలు ఇచ్చారని కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కుంగిపోవాల్సిన అవసరం లేదు..మళ్లీ పుంజుకుని ముందుకు సాగుదామని తమ పార్టీ కార్యకర్తలు భరోసా ఇచ్చారని అన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనే సూచనలే ఎక్కువగా వచ్చాయని చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయాలు పటిష్టంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయాలని నిర్ణయించామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News