Monday, December 23, 2024

ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ తో చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

వెయ్యి కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రైతులు పండించిన ధాన్యంకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు మరో రూ.500 చెల్లించాలని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా చాలమంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సివుందని తెలిపారు.చెల్లించిన రైతులకు కాకున్నా పెండింగ్ లో ఉన్న రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ చెల్లించాలన్నారు. ఏడు వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలతో గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిందని,  వారం, పది రోజులలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించినట్టు గుర్తు చేశారు.

రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమచేయడం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పరాచికాలు ఆడుతున్నదన్నారు. గత నెల 27న ముఖ్యమంత్రి రైతుబంధు డబ్బులు వేసేశాం అని దబాయించారని , ఈ నెల 9న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అందరికి రైతుబంధు వచ్చింది అన్నారని తెలిపారు. సంక్రాతి తర్వాత రైతుబంధు డబ్బులు వేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉన్న విషయం చెప్పారని, రైతుల విషయంలో ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడుతూ గందరగోళపరుస్తున్నారన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ అన్నారని, ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదన్నారు. రైతులను వంచించవద్దని, అలవికాని హామీలు ఇవ్వవద్దని తాము గతంలోనే చెప్పామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేసినా ప్రభుత్వం ఆధారాలు చూయించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా బేసిన్ లో ఈసారి తగినంత వర్షపాతం లేనందున రైతులు తక్కువ మొత్తంలో పంటలు సాగుచేశారని తెలిపారు. గోదావరి బేసిన్ లో లోయర్ మానేరు, అప్పర్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్పి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ లలో పంటల సాగుకు సరిపడా సాగునీళ్లు అందుబాటులో ఉన్నాయని, మరి ప్రభుత్వం ఈ యాసంగికి సాగునీళ్లు ఇస్తుందా ? ఇవ్వదా ? రైతులకు ఏ విషయం ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సిన అవరం ఉందన్నారు.

యాసంగి పంటలు వచ్చే నాటికి పంటల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల పేరుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. తెలంగాణ మిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు.వరంగల్ ఎనుమాముల, ఖమ్మం మిర్చి మార్కెట్లలో మిర్చికి మద్దతుధర దక్కడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎవరూ స్పందించడం లేదని, ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ముందే చర్యలు తీసుకుని అన్ని పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో అన్ని రంగాలకు 24 గంటల కరంటు సరఫరా ఇవ్వడం జరిగిందన్నారు.

వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో గత ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News