Saturday, December 21, 2024

అర్ధరాత్రి వేళ పేదల గుడిసెలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం, గోపాలపురం చెరువు శిఖంలో రెండేళ్ల నుంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బుధవారం అర్ధరాత్రి 1 గంటకు 500 మంది పోలీసులతో జిల్లా అధికార యంత్రాంగం బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేశారు. కాగా, గోపాలపురంలో పేదల గుడిసెలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ, గుడిసెవాసులపై ప్రభుత్వ దమనకాండను ఖండించాలని, పోలీసు జులుం నశించాలని, సిపిఎం జిందాబాద్, గుడిసెవాసుల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గురువారం ఆర్ట్ అండ్ సైన్స్ ఆడిటోరియం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో పక్కా ఇళ్లు ఇవ్వక, ఇంటి స్థలం లేక వేలాది మంది ప్రజలు వేచి చూసి విసిగిపోయి నగరంలో అనేక కేంద్రాల్లో ప్రభుత్వ భూముల్లో గత రెండేళ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు.

గత ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు లేని వారందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే నెల రోజులు తిరగకుండానే పేద గుడిసెవాసులపై ప్రభుత్వం దమనకాండను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గోపాలపురం చెరువులో 22 ఎకరాలు భూమి ఉండగా అందులో 12 ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు యథేచ్ఛగా అమ్ముకున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం నిలువ నీడలేని పేదలు గుడిసెలు వేసుకుంటే వారిపై పోలీసులు ప్రతాపం చూపడాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్ధానం మేరకు ఇళ్లులేని పేదలకు ఇంటి పట్టాతోపాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.

సిపిఎం జిల్లా కార్యవర్శి వర్గసభ్యుడు సారంపెల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. బుధవారం అర్ధరాత్రి గుడిసెలను కూలుస్తుండగా అడ్డుకోబోయిన పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఉప్పలయ్య, జిల్లా నాయకులను, గుడిసెవాసులను, మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. పేదలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు.

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా.. జిల్లా కలెక్టర్ హామీ
ధర్నా అనంతరం గుడిసెవాసుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు అందచేశారు. గోపాలపురం గుడిసెల కూల్చివేతపై కలెక్టర్‌తో చర్చించగా వారు స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చక్రపాణి, కార్యవర్గ సభ్యుడు ఉప్పలయ్య, జిల్లా కమిటీ సభ్యులు వీరన్న, వెంకట్ గుడిసెలు కూల్చివేయడానికి వచ్చిన పోలీసులను ఆపడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News