Sunday, November 24, 2024

ఒమన్ జలసంధిలో చమురు ట్యాంకర్ హైజాక్!

- Advertisement -
- Advertisement -

దుబాయి: అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాజాగా ఓ చమురు ట్యాంకర్‌గా కేంద్ర బిందువుగా మారింది. ఒమన్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్‌లోకి మిలిటరీ యూనిఫామ్‌లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని, బహుశా వారు దీన్ని హైజాక్ చేయడం కోసం ఈ పని చేసి ఉంటారని బ్రిటన్ మిలిటరీకి చెందిన ఓ అడ్వైజరీ సంస్థ, ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ హెచ్చరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియారాలేదు కానీ మధ్యప్రాచ్య సముద్ర మార్గంలో జరుగుతన్న వరస హైజాక్‌లలో ఇది తాజాది కావచ్చని ఆ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో సహజంగానే అనుమానాలు ఇరాన్ వైపే పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎర్రసముద్రం ప్రాంతంలో ఇరాన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు పలు వాణిజ్య నౌకలను హైజాక్ చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ఒమన్, ఇరాన్ దేశాల మధ్య గురువారం ఉదయం ఈ నౌకను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలైనట్లు మధ్యప్రాచంలో ప్రయాణించే నౌకల సిబ్బందికి ప్రమాద హెచ్చరికలు అందించే బ్రిటీష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పేర్కొంది. నౌక సెక్యూరిటీ మేనేజర్‌నుంచి వచ్చిన ఓ టెలిఫోన్ సందేశంలో ఆయన గొంతుతో పాటుగా ఇతరుల గొంతుకలు కూడా వినిపించాయని ఆ సంస్థ తెలిపింది. నౌకను కాంటాక్ట్ చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలమయినట్లు తెలిసిన ఆ సంస్థ నౌకలోకి ప్రవేశించిన వారు మిలిటరీ దుస్తులు, నల్లటి ముసుగులు ధరించి ఉన్నట్లు తెలిపింది. సెయింట్ నికోలస్‌గా పిలవబడే ఆ నౌకలోకి ఆరుగురు మిలిటరీ వ్యక్తులు ప్రవేశించారని, నౌకలోకి ప్రవేశించే ముందు వారు నిఘా కెమెరాలను కవర్ చేశారని ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ అంబ్రూ తెలిపింది. ఇరాక్‌లోని బస్రా రేవులో చమురును నింపుకొని బయలుదేరిన ఈ ట్యాంకర్ టర్కీలోని అలియాగాకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ట్యాంకర్ దారి మళ్లి ఇరాన్‌లోని బందర్‌ఇ జస్క్ రేవు దిశగా వెళ్తున్నట్లు ఎపి వార్తాసంస్థ విశ్లేషించిన శాటిలైట్ ట్రాకింగ్ డాటాను బట్టి తెలుస్తోంది. సెయింట్ నికోలస్ అనే ఈ ట్యాంకర్ ఇంతకు ముందు ‘సూయెజ్ రాజన్’ పేరుతో ఉండేది. గ్రీక్ షిప్పింగ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఈ చమురు ట్యాంకర్ గతంలో ఇరాన్ సముద్ర జలాల్లో హైజాక్‌కు గురి కాగా దాదాపు ఏడాది పాటుఅమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం కొనసాగింది. చివరికి అమెరికా న్యాయ శాఖ ఈ ట్యాంకర్‌లోని పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును స్వాధీనం చేసుకుంది కూడా. కాగా నౌకతో సంబంధాలు కోల్పోయినట్లు పేర్కొన్న ఏథెన్స్‌లోని ఎంపైర్ నేవిగేషన్ సంస్థ అందులో 18 మంది ఫిలిప్పీన్స్‌కు చెందిన సిబ్బంది, ఒక గ్రీకు జాతీయుడు ఉన్నట్లు తెలిపింది. అంతకు మించి సంస్థ వివరాలు వెల్లడించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News