Friday, November 22, 2024

దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం ముందు వరుసలో ఉన్నాము. ఇది ఒక రకంగా భారత దేశానికి అందివచ్చే విషయం. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే మనం అగ్రగామి మారే అవకాశం ఉంది. యువతకు ఆదర్శ గురువు, మానవాతవాది దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. ఆయన జయంతిని పురస్కరించుకొని యువతను సన్మార్గంలో నడిపించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ప్రతి ఏటా భారత ప్రభుత్వం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. దేశాభివృద్ధిలో యువ జనాభా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ నేటి సమకాలీన పరిస్థితుల్లో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలు యువతను పట్టి పీడిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి యువత కాలాన్ని వృథా చేస్తూ, పెడదారి పట్టిస్తున్నాయి.

మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాల ఉచ్చులో యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వ్యభిచారం, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లింగ వివక్ష యువ మహిళా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటి ప్రభావం పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతపై ఎక్కువ ఉన్నదనేది నిర్వివాదాంశం. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ సైతం తగ్గుతున్నది. దీంతో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు నేటి పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకుల వేటలో విద్యార్థి దశ నుంచి ఒత్తిడికిలోను కావడం వీటికి కారణమవుతున్నాయి. అధిక యువ జనాభా గల మన దేశంలో యువతను పెట్టుబడిగా భావించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటీవల, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (ఎంఒఎస్‌పిఐ) ‘యూత్ ఇన్ ఇండియా 2022’ నివేదికను విడుదల చేసింది, ఇది 2021- 2036 మధ్య కాలంలో వృద్ధుల జనాభా పెరుగుతుందని, యువత జనాభా వాటా తగ్గడం ప్రారంభమైందని పేర్కొన్నది. వీరి జనాభా ప్రారంభంలో పెరుగుతుందని అంచనా వేయబడింది. మొత్తం జనాభాలో 15- 29 సంవత్సరాల వయసు గల యువ జనాభా 1991లో 22.2 కోట్లు కాగా, 2011 నాటికి 33.3 కోట్లుకు పెరిగింది.2021 నాటికి 37.1 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడింది. ఆ తర్వాత 2036 నాటికి 34.5 కోట్లకు తగ్గుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది భారత దేశానికి అనుకూలమైన డెమోగ్రాఫిక్ డివిడెండే అని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ దేశంలో యువ కార్మికులలో అధిక శాతం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో పని చేయడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

మరో వైపు కోవిడ్ ఆర్థిక ప్రభావం యువత ఉద్యోగ విపణిలో సవాలుగా మారాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్య అభివృద్ధి పట్ల తీవ్ర ప్రభావం చూపింది. యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం దీటైన వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. యువతను నైపుణ్యం గల శ్రామిక శక్తిగా మార్చకపోతే వీరు సామాజిక అస్థిరత కారణమై జాతి భద్రతకు పెను సవాళ్లుగా మారే ప్రమాదం ఉంది. యువతను సమర్థవంతమైన మానవ వనరులుగా మార్చడానికి ప్రభుత్వాలు చట్టపరమైన, విధానపరమైన చర్యలతో ముందుకు వెళ్లాలి. అప్పుడే నిరుద్యోగం, పేదరికం లాంటి సామాజిక సమస్యలు తొలగి సామాజిక మార్పు సాధ్యమవుతుంది. సంపదను సృష్టించే గలిగే సామర్ధ్యాలను యువతకు అందించడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానంలోని పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యపై శిక్షణ ఇవ్వాలని పేర్కొనడం హర్షణీయం. యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తగిన శిక్షణ ఇచ్చి,

సంస్థాగత రుణ సదుపాయాన్ని కల్పించాలి. యువత కుటీర పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రోత్సహించాలి. ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల, ఆర్థిక క్రమశిక్షణ పట్ల యువతీ, యువకులకు అవగాహన కల్పించాలి. యువత వ్యవసాయాన్ని ఉపాధిగా స్వీకరించడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. యువతకు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తిపై పాఠశాల స్థాయిలో నుంచే బోధించాలి. ఎన్‌ఎస్‌ఎస్ (NSS) వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి సామాజిక స్పృహను పెంపొందించాలి. రాజకీయ అవకాశాలు కల్పించాలి. ఆధునిక మార్కెట్ అవసరాల కనుగుణంగా ఉద్యోగాలకు సిద్ధం చేయాలి. దీనికై పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. యువ కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధుల కేటాయించాలి. యువజన మంత్రిత్వ శాఖ సైతం అనేక పథకాలు, కార్యక్రమాలతో క్రియాశీలక పాత్ర పోషించాలి. భారత స్వాతంత్య్రానికి 75 వసంతాల పూర్తయిన వేళ యువ జనాభా నిరాశ నిస్సృహలను విడనాడి దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News