మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకుల ఉపాధ్యాయులు ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని, గురుకుల ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తొలగించాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. శనివారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో డి. ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన టిఎస్ యుటిఎఫ్ అనుబంధ సాంఘీక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర సదస్సులో చావ రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు గురుకుల సొసైటీలను ఒకే డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖలో 40 వేల పాఠశాలలు ఒకే డైరెక్టర్ పరిధిలో ఉన్నప్పుడు వెయ్యి గురుకులాలకు ఐదు సొసైటీలు, ఐదుగురు సెక్రటరీలు, ప్రత్యేక యంత్రాంగం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
నూతన ఉపాధ్యాయుల నియామకాలకు ముందుగానే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని కోరారు. గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలను ప్రశంసించే అధికారులు అందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, అన్ని గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
సాంఘీక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడుగా డి. ఎల్లయ్య (అసిఫాబాద్), ప్రధాన కార్యదర్శిగా ఎస్ శశిధర్ (నల్లగొండ), కోశాధికారిగా ఎండి అనీసా ( సిద్దిపేట) ఉపాధ్యక్షులుగా వి బోస్, ఎ ప్రేమ్ కుమార్, పి నరేందర్, టి మాధవి, వసీఫ్ అజమ్, రహీమ్ పాషా, కార్యదర్శులుగా శాంసన్, ఎం జనార్ధన్, పుష్ప, కృష్ణయ్య, మరో పది మంది కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి ఎ సింహాచలం, వివిధ గురుకులాల నుండి హాజరైన పలువురు ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు.