న్యూఢిల్లీ : భారత వాతావరణ శాఖ సంస్థాపక 150 వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘పంచాయత్ మౌసమ్ సేవ’ (పంచాయతీ వాతావరణ సేవ )ను ఆ శాఖ ప్రారంభించనున్నది. దీని లక్షం ప్రతిగ్రామం లోను ప్రతి రైతు వాతావరణ ముందస్తు అంచనాలను తెలుసుకునేలా చేయడంతోపాటు వాతావరణ సేవల జాతీయ ఫ్రేమ్‌వర్క్ నుంచి వాతావరణ సమాచారాన్ని ప్రధాన స్రవంతిలో ప్రతిరంగం లోను, కార్యాచరణ లోను అందించడం. ఈ నేపథ్యంలో చిన్నస్థాయి వాతావరణ సంఘటనలను ముందుగా అంచనా వేయడంలో ఈ శాఖ సతమతమవుతున్నప్పటికీ, కృత్రిమ మేథ (ఎఐ),ఫాస్టర్ సూపర్ కంప్యూటర్లు ఉపయోగించి వాతావరణ అంచనాలను, హెచ్చరికలను మరింత సమర్ధంగా అందించేలా చక్కదిద్దే ప్రయత్నంపై వాతావరణ శాఖ దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా భారత వాతావరణ శాఖ (ఐఎండి) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో రానున్న కాలంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో వాతావరణ సమచారాన్ని ఏ విధంగా అందించనున్నారో తెలియజేశారు.
తుపాన్లు, భారీ రుతుపవనాల వర్షాలు, ముందుగానే అంచనా వేయడంలో సహాయ పడడానికి వీలుగా ఒడిశా, మధ్యప్రదేశ్‌ల్లో అధ్యయన కేంద్రాలను నెలకొల్పామని తెలిపారు. వాతావరణ ముందస్తు అంచనాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ( ఎఐ )లో అత్యంత ఆధునిక పద్ధతులను, మెషిన్ లెర్నింగ్( ఎంఎల్) ఉపయోగించడానికి ఇప్పుడు ప్రణాళికలు రూపొందుతున్నాయని వివరించారు. ఎఐ/ఎంఎల్‌పై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడమైందని, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఐటిలతో సమన్వయమై కచ్చితంగా వాతావరణాన్ని అంచనా వేసే పరికరాలను రూపొందించడమౌతుందని తెలిపారు. గణాంక నమూనాల సామర్థాన్ని అభివృద్ధి చేయడానికి వాతావరణ కార్యాలయం తన కంప్యూటింగ్ వ్యవస్థలను ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయడమౌతుందని చెప్పారు. ఈ సామర్థాన్ని 10 పెటాఫ్లాప్స్ నుంచి 30 పెటాఫ్లాప్స్ వరకు పెంచనున్నట్టు తెలిపారు.( పెటాఫ్లాప్స్ అంటే కంప్యూటర్ వేగాన్ని కొలిచే యూనిట్ ). ప్రస్తుతానికి ఐఎండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్‌సైన్సెస్ (ఎంఒఇ) వాతావరణ నమూనాల రిసల్షూన్ 12 కిలోమీటర్ల పరిధి వరకు ఉండగా, దాన్ని 6 కిలోమీటర్లకు తగ్గించాలన్నది లక్షంగా పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ నమూనాల వ్యవస్థ 3 కిమీ నుంచి 1 కిమీకు అభివృద్ధి చేస్తామన్నారు.