Friday, January 10, 2025

మూల్య ప్రవాహ 2.0: మూలం సారం

- Advertisement -
- Advertisement -

‘Inculcation of Human Values and Professional Ethics in Higher Education Institutions proposes the curriculum and pedagogy of Higher Education Institutions (HEIs) to develop deep respect towards Fundamental Duties and Constitutional Values among the students, bonding with one’s country, and conscious awareness of the roles and responsibilities in a changing world, including universal human values of truth (satya), righteous conduct (dharma), peace (shanti), love (prema), non-violence (ahimsa), scienti fic temper, citizenship values, and also life-skills’.- Prof. M. Jagadesh Kumar Chairman, University Grants Commission

ఉన్నత విద్యలో మానవీయ విలువలు (Human Values), వృత్తిగత నీతులు (Professional Ethics) పెంపొందించడం లక్ష్యంగా 2019లో యుజిసి ‘మూల్య ప్రవాహ 2.0’ పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మూల్య ప్రవాహ 2.0 స్ఫూర్తికి లోబడే NEP- 2020 రూపొందింది. వ్యక్తులకు, సంస్థలకు దిశానిర్దేశం చేయడం ద్వారానే విలువల ఆధారిత సంస్థలు, సమాజ నిర్మాణం కాగలవు. అట్లాగే ప్రాథమిక విధులు, రాజ్యాంగ విలువల పట్ల లోతైన గౌరవాన్ని పెంపొందించి పౌరులకు మాతృదేశంతో బలీయమైన బంధాన్ని పెంపొందించే దిశగా ఉన్నత విద్యా సంస్థలు పని చేయాలన్న నిర్మాణాత్మక తలంపే ‘మూల్య ప్రవాహ 2.0’ లక్ష్యం. మూల్య ప్రవాహ అర్థం కావడం, అవగాహన ఏర్పడటం ఎట్లా? అన్నపుడు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ టాగోర్ మహానుభావుల ప్రసక్తి ఇక్కడ తప్పనిసరి.‘శక్తివంతమైన దేశం, సంపన్నమైన దేశం శీలవంతులైన పౌర వ్యవస్థ నెలకొంటేనే సాధ్యం, ఇందుకు దోహదపడేదే నైతిక విద్య. విద్య భౌతిక, మేధో, ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’ అన్నారు స్వామి వివేకానంద.‘

విలువలు లేని విద్య అసంపూర్ణమని, న్యాయం మూర్తీభవించే శాంతియుత సమాజాన్ని సృష్టించడానికి సత్యం, అహింస, కరుణ వంటి విలువలు అనుసరణీయాలు. విద్యలో విజ్ఞానంతో పాటు విలువల వికాసమే కీలకం’ అంటారు జాతిపిత మహాత్మా గాంధీ. దేశ సమగ్రాభివృద్ధిలో విలువల విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ‘విద్య వ్యక్తికిసమాజానికి మధ్య స్వభావ సమన్వయ వేదికగా ఉంటూ బాధ్యతాయుత పాత్రను పోషించాలి’ అన్నారు విశ్వకవి గురుదేవులు రవీంద్రుడు. ఈ మూడు వ్యాఖ్యలు గంభీరంగానో, గహనంగానో అనిపించిన వాళ్ల కోసం ఇదిగో ఈ వివరణ: మనలో ప్రతి ఒక్కరం వ్యక్తిగానో, సంస్థాపరంగానో రోజూ వందలాది నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములుగా ఉంటాం. మనం తీసుకునే నిర్ణయాల్లో మనం పాటించే విలువలు, నమ్మకాలు ప్రతిబింబిస్తాయి. ప్రతి నిర్ణయానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. అప్పుడే అది సంతృప్తిని ఇవ్వగలదు. అయితే ఆ సంతృప్తి వ్యక్తిగత మైందీ కావొచ్చు, సంస్థాగతమైందీ కావొచ్చు. ఉత్తమ నిర్ణయాలు, ఉదాత్తమైన నిర్ణయాలతో సమకూరేదే అసలు సిసలైన సంతృప్తి. అంటే విలువలతో కూడుకున్న నిర్ణయాలే సరైన నిర్ణయాలు, సంతృప్తికర నిర్ణయాలు అని అర్థం. వ్యక్తి అభ్యున్నతికి, సాంఘిక వికాసానికి మూలధనంగా, విశ్వసామరస్యానికి చోదకశక్తిగా ఉన్నత విద్య పని చేయాలన్నదే మూల్య ప్రవాహ 2.0 ముఖ్యోద్దేశం.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిత్వం దేశానికి నూతన రాజకీయాలతోపాటు కొత్త అభివృద్ధి పరిభాషను మోసుకొచ్చింది. వాటిల్లో మేక్ ఇన్ ఇండియా ఒకటి. మేక్ ఇన్ ఇండియాలో నాలుగు ఇన్షియేటివ్ పిల్లర్లుంటాయి.అవి: కొత్త మైండ్‌సెట్, కొత్త రంగాలు, కొత్త మౌలిక సదుపాయాలు, కొత్త ప్రక్రియలు. అందుకే కేవలం తయారీ రంగాన్ని మాత్రమే కాకుండా మేక్ ఇన్ ఇండియా ఇతర రంగాలకూ కూడా ప్రోత్సహం కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఇన్షియేటివ్స్‌లో భాగంగానే ఉత్పత్తి రంగానికి సంబంధించి 2016 నుండి ప్రధాని నరేంద్ర మోడి ఇస్తున్న నినాదం ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ (ZED). ఈ నినాదం ఉత్పత్తి ప్రక్రియలో సామర్థ్యపు గుణగణాలకు దేశం వేస్తున్న చాటింపు.అంటే, భారతీయ ఉత్పత్తుల్లో ఏ లోపాలు ఉండవు, ఉత్పత్తి ప్రక్రియ ఎటువంటి ప్రతికూల పర్యావరణ ప్రభావాలనూ కలిగి ఉండదని అర్థం. భారత దేశాన్ని ప్రపంచంలో మెరుగైన తయారీ కేంద్రంగా మార్చడానికి, దేశీయ మేధాశక్తితో అభివృద్ధి చేసిన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో ఎక్కడా తిరస్కరణకు, ఉపేక్షకు గురికాకుండా ఉండడం కోసం, ప్రపంచ ఆమోదం ఆదరణ పొందడం కోసం ’ZED’ మోడల్ ఒక శ్రేయోమార్గమని ప్రభుత్వ చెబుతున్నది.

తదనుగుణంగానే పారిశ్రామిక రంగ నిపుణులు సైతం ఉత్పాదకత స్వావలంబనల పాలిట ZED ఒక భిక్షగా, వరంగా భావిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ESG (Environ mental Social Governance) ఉద్యమం ZED కు అనుసంధానమే. అయితే, ‘జెడ్’ నినాదం మొట్టమొదట 1964, 1970 ప్రాంతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అమెరికన్ వ్యాపార వేత్త, రచయిత, నిర్వహణ సిద్ధాంత కర్త, నాణ్యత నిర్వహణ పద్ధతుల ప్రవక్త Philip Crossby తన ‘Quality is free : the art of making quality certain’ (1979) గ్రంథంలో జీరో డిఫెక్ట్ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘నాణ్యత అంటే అవసరాలకు అనుగుణంగా ఉండటమని, లోపనివారణ ద్వారా నాణ్యత సాధించబడుతుందే తప్ప మదింపు ద్వారా కాదని, నాణ్యత జీరో డిఫెక్ట్‌ల పని తీరు ప్రమాణాన్ని కలిగి ఉంటుందని, ధరను బట్టి నాణ్యతను కొలవాలనే నాలుగు సంపూర్ణ నాణ్యతా ప్రమాణాల (4 Absolutes of Quality Standards)ను క్రాస్బీ వృత్తి, వాణిజ్య రంగాలకు ఉద్బోధించాడు.

ఈ ప్రమాణాల ప్రాతిపదికన్నే ఐబియం, సౌత్‌వెస్ట్ బెల్, ఆర్మ్‌స్ట్రాంగ్ వరల్డ్ ఇండస్ట్రీస్, జాన్సన్ & జాన్సన్, జనరల్ మోటార్స్, మిల్లికెన్, పెర్డ్యూ ఫార్మ్ ఫెడరల్ ప్రిజన్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల నుండి ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ ఇచ్చి Philip Crossby Associates (PCA)గా ఇమేజ్ కల్పించాడు. ‘If you are out ot of quality, you are out of business’ అనేది పారిశ్రామిక రంగానికి ఫిలిప్ క్రాస్బీ చెప్పిన ముఖ్య జాగరూకత.క్రాస్బీ మహాశయుడు పారిశ్రామిక సంస్థలకు చెప్పిన ఇంకో నాణ్యతా సులభ సూత్రమేమంటే ‘మొదట్లోనే పనులను సరిగ్గా చేయాలి. లోపాలను పరిష్కరించడానికి, మార్చుకునే పక్షంలో వినియోగ దారులనుండి అదనంగా ఏ రకమైన వసూళ్లు చేయకండి. మీరు పెద్ద ప్లాంట్‌ని నిర్వహించినా, స్వంత చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా నాణ్యతా నియంత్రణకు సంబంధించిన పైన పేర్కొన్న సులభ సూత్రాన్ని అనుసరిస్తే అత్యంత లాభాలను సహజంగా గడించవచ్చు’నని. ఉత్పత్తిదారుడు తన పంపిణీదారుల ద్వారా కావొచ్చు, అమ్మకందారుల ద్వారా కావొచ్చు, ఉత్పత్తి సేవల సప్లై చైన్ ద్వారా కావొచ్చు విజయవంతం చేయాల్సిన వ్యక్తి వినియోగదారుడు.

వినియోగదారులకు ఏది అవసరమో పరిశ్రమలు గుర్తించాలి, అవసరమైన వస్తువులను ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా ఇవ్వాలో నేర్చుకోవాలనేది ‘Quality Is Free’ గ్రంథసారం.మన మాటల్లో చెప్పుకుంటే ‘మాల్ బాగుంటేనే మంది నచ్చుతరు, బ్రాండైనా బాగా లేనపుడు బద్నాం అవుతం’ అనేదే ఫిలిప్ క్రాస్బీ ఉత్పాదకులకు చెప్పిన హితవాక్యం. ఈ మెళకువనే అభివృద్ధి చెందిన దేశాలు గత ఆరేడు దశాబ్దాలుగా పాటిస్తూ పారిశ్రామికాభివృద్ధిని అంచనాలకు మించి సాధించాయి.
విద్య, సంపూర్ణ విద్యగా కమ్యూనిటీ సేవ లక్ష్యంగా ఉండాలన్న భావ ధారను మూల్య ప్రవాహ 2.0 పునరుద్ఘాటిస్తుంది.నాణ్యత మాండేట్ గా సమారంభమైన 2019 నాటి మార్గదర్శకాలకు అనుబంధంగా పోయిన ‘మే’ నెలలో యుజిసి రూపొందించిన ముప్పై ఒక్క పేజీల అధికారిక మాడ్యూల్ యూనివర్సిటీల బోధన, పరిశోధనల బలోపేతంపై దృష్టిని సారించింది. విశ్వవిద్యాలయాల నుండి యువత ప్రతిభా పాండిత్యాలతో వృత్తి నైపుణ్యాలతో సహా మానవ విలువలు, వృత్తినీతుల్లో భాగమైన ‘సమైక్యత (Integrity), విశ్వసనీయత (Trustee ship), సామరస్యం (Harmony),

జవాబుదారీతనం (Accountability), సమ్మిళితత్వం (Inclusiveness), అంకితభావం (Commitment), గౌరవం ప్రపత్తి (Respectful ness), నమ్మకం (Belon gingness), సుస్థిరత (Sustainability), రాజ్యాంగ విలువలు (Constitutional Values), విశ్వపౌరసత్వం Global Citizenship’ వంటి ఉత్తమ గుణాలతో సమాజంలోకి రావాల్సుందని మూల్య ప్రవాహ 2.0 నొక్కి చెబుతుంది. ఈ సందర్భాన కొత్త తరానికో మనవి. మనకో పెద్ద ఇల్లుండటం, భారీ మొత్తంలో బ్యాంక్ బాలెన్స్ ఉండడం, నగలు నట్రా, లక్జరీ కారు, భూములు ఇటువంటివన్నీ బాహ్యాసంపద, భౌతిక సంపద. సూపర్ ఫిషియల్ లైఫ్ అంటుంటామే బాహ్య సంపద దాన్ని వృత్తం చేసుకుటుంది. మరి, మనం దైనందిన జీవితంలో అనుసరించే మానవీయ విలువలు, పాటించే వృత్తినీతులు మన అంతఃసంపద. ఇదే శీల సంపద. మానవాళిని వేల తరాలకు ప్రకాశింపజేసేది ఈ సంపదే. ‘జీరో డిఫెక్ట్’ గల ఉత్పత్తులు సృష్టించి మార్కెట్ పెంచుకోగలిగినా, నేను నాది అనే స్వార్థం మనిషిని ‘జీరో ఎఫెక్ట్’ గురించి పట్టించుకోనీయదు. ఇప్పుడు ప్రకృతి, పర్యావరణం ఎంతటి సంక్షోభంలో ఉన్నాయో,

ఎలా ప్రకోపిస్తున్నాయో మనకు తెలిసిందే. అందుకే పారిశ్రామిక రంగంలో జీరో డిఫెక్ట్ ఎంత ముఖ్యమో, జీరో ఎఫెక్ట్ కూడా అంతకంటే ముఖ్యం. సొంత లాభాల మైకంలో మనుషులు సమాజానికి జరుగుతున్న హానిని లక్ష్యపెట్టడం లేదు. ఉన్నత విద్యాసంస్థలు పూనుకొని ఉత్పదకతా రంగంలో జీరో డిఫెక్ట్ గురించిన మేధస్సును పెంచుతూనే,జీరో ఎఫెక్ట్ గురించిన పూచీకత్తును కూడా మేధో యువతకు తెలియజెప్పాలి. ఇది డిగ్రీ పిజీ స్థాయి కరికులంలో పాఠ్యాంశాల్లో జొప్పించి నేర్పిస్తేనే యువత అలవరచుకుంటారు. ఈ మహత్తర ఉద్యమాన్ని మూల్య ప్రవాహ 2.0 సంకల్పించింది. కార్యశీలతను గురుశిష్యులకు అప్పగించింది. నేర్పుతున్న నేర్చుకుంటున్న సబ్జెక్టులతో పాటు సామాజిక బాధ్యతగా మానవ విలువలు వృత్తి నీతులను గురువులను బోధించమంటున్నది, శిష్యులను ఒంటపట్టించుకొని విశ్వమానవులుగా ఎదగమంటున్నది. వసుధైక కుటుంబాన్ని కోరుకుంటున్నది. వృత్తి నిర్వహణలో సామాజిక నిబద్ధతను, మానవ సంబంధాల్లో ధార్మిక విలువలను ప్రతిష్ఠించేందుకు యుజిసి ప్రయత్నిస్తోంది. హర్షిద్దాం, ఆచరిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News