తన రాసక్రీడలకు అడ్డుగా ఉందనే కోపంతో ప్రియుడి ఏడాది వయసున్న పసిపాపను దారుణంగా చంపిందొక యువతి. పసిబిడ్డను చంపేందుకు ఆమె ఎంచుకున్న విధానాలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అమెరికాలోని లారెన్స్ కౌంటీకి చెందిన 20 ఏళ్ళ అలీసియా ఓవెన్స్, బెయిలీ జాకొబీ ప్రేమించుకున్నారు. జాకొబీకి అంతకుముందే పెళ్లయి, విడాకులు తీసుకున్నాడు. అతనికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది.
తర్వాత అతను ఓవెన్స్ తో ప్రేమలో పడ్డాడు. అయితే ప్రియుడితో తన రాసలీలలకు ఏడాది పాపను లారెన్స్ అడ్డుగా భావించి, ఆ పసిపాపను చంపేందుక ప్లాన్ చేసింది. ప్రియుడు లేనప్పుడు పాపను చేరదీసి, ఆమె చేత వాటర్ బీడ్స్, బటన్ షేపులో ఉండే బ్యాటరీలు, స్క్రూలు మింగించింది. పసిపాప అనారోగ్యం బారిన పడటంతో జాకొబీ ఆస్పత్రిలో చేర్పించాడు. పాపను పరీక్షించిన డాక్టర్లు ఆమె కడుపులోంచి 20కి పైగా వాటర్ బీడ్స్, బ్యాటరీలు, ఒక స్క్రూను వెలికి తీశారు. అప్పటికీ తన ప్రియురాలిపై జాకొబీకి అనుమానం కలగలేదు.
చివరకు గత జూన్ లో ఎసిటోన్ అనే విష పదార్ధాన్ని ఓవెన్స్ ఆ పసిపాపతో తాగించింది. దాంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాప పరిస్థితిని గమనించిన జాకొబీ వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ పసికందు కన్నుమూసింది. పాప మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఆమెది సహజ మరణం కాదనీ, ఎసిటోన్ అనే విష పదార్ధం వల్లనే చనిపోయిందనీ తేలింది.
పోలీసులకు ఓవెన్స్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆమె సెల్ ఫోన్ తీసుకుని చూస్తే, ఆశ్చర్యపోయే సంగతులు బయటపడ్డాయి. “పసికందును చంపడం ఎలా?”, “పిల్లలకు హాని కలిగించే బ్యూటీ ఉత్పత్తులు” వంటి విషయాలపై నెట్ లో సెర్చ్ చేసినట్లు తెలిసింది. వెంటనే ఓవెన్స్ ను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు బెయిల్ తిరస్కరించింది.