న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును కోర్టు పర్యవేక్షణలో సర్వే జరపాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. 2023 డిసెంబర్ 14న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలును నిలిపివేస్తున్నట్లు ్జజస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయడాన్న పర్యవేక్షించడానికి కోర్టు కమిషనర్‌ను నియమించడానికి అలహాబాద్ హైకోర్టు గతంలో అంగీకరించింది. ఈ మసీదు వెలసిన చోట ఒకప్పుడు ఆలయం ఉండేదంటూ హిందూ పక్షాలు వాదిస్తున్నాయి. ఈ కేసు విషయంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు న్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వ్లులో అభిప్రాయపడింది. సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నయమించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చాలా పేలనంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను ఎందుకు కోరుతున్నారో నిర్దిష్టంగా చెప్పాలే తప్ప పేలవమైన దరఖాస్తు చేసుకుంటే చాలదని ధర్మాసనం తెలిపింది.
ప్రతి అంశాన్ని కోర్టు పరిశీలనకే వదిలివేయడం సరికాదని హిందూ సంస్థలైన భగవాన్ శ్రీకృష్ణ విరాజ్‌మాన్, తదితర సంస్థల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ష్యాం దివాన్‌కు ధర్మాసనం తెలిపింది. హిందూ సంస్థలకు నోటీసులు జారీచేస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం వివాదానికి సంబంధించి హైకోర్టులో జరుగుతున్న వాదనలు కొనసాగవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ షాహీ ఈద్గా మసీదు నిర్వాహక కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీచేసింది.