వేలాది మంది భక్తులకు దర్శనం
భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప స్వామి ఆలయం
పథనంథిట్ట : కేరళలోని శబరిమలలో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం విలసిల్లింది. పెక్కు రోజులుగా కొండపై మకాం వేసిన వేలాది మంది భక్తులు సోమవారం మకరవిళక్కు పర్వదినం సందర్భంగ శుభప్రదమైన ‘మకర జ్యోతి’ దర్శనం చేసుకున్నారు. సన్నిధానం, పరిసర ప్రాంతాలలో ఎంతో ఆసక్తితో వేచి ఉన్న భక్తులు మకర జ్యోతి దర్శనం కాగానే ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని నినదించారు.
‘మకర జ్యోతి’, ‘మకరవిళక్కు’ దర్శనల కోసం సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వీక్షించేందుకు ఏర్పాటు చేసిన పది నిర్దేశిత వీక్షణ కేంద్రాలతో జనంతో కిక్కిరిసిపోయాయి. అంతకు ముందు ‘తిరువాభరణం’ లేదా పవిత్ర ఆభరణాలతో కూడిన పెట్టెలు సాయంత్రం 5.15 గంటలకు పండలంప్యాలెస్ నుంచి శబరిమలకు చేరుకున్నాయి. వాటిని ఆలయం తంత్రి కందరారు మహేశ్ మోహనరారుకు అందజేశారు. కేరళ దేవస్వమ్ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్, ట్రావన్‌కోర్ దేవస్వమ్ బోర్డ్ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆలయం ప్రధాన దైవం అయ్యప్ప స్వామిని ‘తిరువాభరణం’తో అలంకరించారు. రాత్రి సుమారు 6.45 గంటలకు ‘దీపారాధన’ జరిపారు. రెండు నిమిషాల అనంతరం ఆలయానికి ఎదురుగా కొండలపై గల పొన్నాంబళమేడు పరిసరాలలో మూడు సారు మకరవిళక్కు జ్యోతి దర్శనం ఇచ్చిన వెంటనే ‘స్వామియే శరణం అయ్యప్ప’ నినాదం మిన్నుముట్టింది.