Monday, December 23, 2024

కవితకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

 లిక్కర్ కేసులో మరోసారి నోటీసులు

సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున రాలేనని వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఇడి నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఇడి నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇడి నోటీసులపై స్పందించిన కవిత విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఇదే విషయంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపారు. గతంలో మూడు సార్లు కవితకు ఇడి అధికారులు నోటీసులు ఇచ్చారు.

దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే గతేడాది మార్చిలోనే కవితను ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో అధికారులు పలుమార్లు విచారించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్‌కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని ఇడి ఆరోపిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కవిత విచారణకు రానని తేల్చి చెప్పడంతో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఇడి అధికారులు వెయిట్ చేస్తారా? లేక విచారణకు రావాల్సిందేనని మరోసారి నోటీసులు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News