న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఏఏ అంశాలను పొందు పరచాలో సూచనలు ఇవ్వవలసిందిగా దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఇది ప్రజా మ్యానిఫెస్టో అని మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం బుధవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ప్రజలుఇచ్చే సలహాలు, సూచనలను తమ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలో మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు ప్రజలతో సంప్రదింపులు జరపడంతోపాటు ప్రజల నుంచి సూచనలను స్వీకరించేందుకు ఒక ఈమెయిల్ అకౌంట్‌ను, ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామని చిదంబరం తెలిపారు. ప్రజలు తమ సూచనలను నేరుగా వీటికి పంపవచ్చని ఆయన చెప్పారు. మ్యానిఫెస్టోను ఎవరి కోసమైతే రూపొందిస్తున్నామో వారి సూచనలను తప్పకుండా కోరవలసిందేనని కమిటీ కన్వీనర్ టిఎస్ సింగ్ దేవ్ తెలిపారు. మ్యానిఫెస్టో అన్నది మేధావులకే పరిమితం కారాదని ఆయన స్పష్టం చేశారు.
కాగా..కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పార్టీ ఆలోచనలను వెల్లడించారు. కాంగ్రెస్ ఒక పార్టీ కాదని, అది ప్రజల గొంతుకని ఆయన పేర్కొన్నారు. సామాన్యుల ఆశయాలు, అభీష్టాలకు అనుఉణంగా మ్యానిఫెస్టో రూపొందుతుందని, పార్టీ పెద్దల ఆలోచనలను ప్రజలపై రుద్దడం పట్ల తమ పార్టీకి నమ్మకం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీ మ్యానిఫెస్టోకు సలహాలు అందచేయవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 16 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్, శశి థరూర్ కూడా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారంటూ ఇప్పటికే ఊహాగానాలు మొదలుకావడం విశేషం. ఈసీటు కోసం ఇద్దరు వ్యక్తులను ఇప్పటివరకు ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీతోపాటు బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు.