బీజింగ్ : కరోనా మూలాల గుట్ట ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ వైరస్‌ను చైనాయే సృష్టించిందని, దాన్ని ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతున్న సమయంలో కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ సంగతి బయటపడిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం సార్స్ కొవ్2 కు చెందిన జిఎక్స్ పి2 వి అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగు చూసిన జీఎక్స్ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు.
జిఎక్స్ పి2 వి మ్యుటేటెడ్ వెర్షన్‌ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించగా, తీవ్ర ప్రభావం చూపించిందని, ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని ఆ అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు , ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని తెలియజేసింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవ లేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జిఎక్స్ పి2 వి వైరస్‌తో మనుషులకు తీవ్ర ముప్పు కలుగుతుందని అర్థమవుతున్నట్టు అధ్యయన అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చైనా ప్రయోగాలు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే తాజా ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.