Thursday, December 19, 2024

అద్దంకి ఔట్.. మహేశ్ ఇన్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మార్క్ ట్విస్టులు ఎంఎల్‌సి అభ్యర్థుల జాబితా ఖరారులో కనిపించాయి. ఎంఎల్‌ఎ కోటాలో రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసినట్లుగా మంగళవారం వారికి ఎఐసిసి నుంచి సమాచారం వచ్చింది. అయితే బుధవారం రిలీజయిన జాబితాలో మాత్రం బల్మూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది. దీంతో అద్దంకి దయాకర్ కు షాక్ తగిలినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అద్దంకి దయాకర్ సీటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. అదే తరహాలో ఎంఎల్‌సి ఎంపికలోనూ చివరి వరకు ఆయన రేసులో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్‌ను కాదని మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేయటం విశేషం.

పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున బీఫారాలు పంపిణీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డికి ఇచ్చింది. ఈ మేరకు ఆయన బీఫారాలు వీళ్లిద్దరికీ ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ కు చెందిన ఆయన కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నించారు కానీ టిక్కెట్ లభించలేదు. దాంతో ఆయన ఎంఎల్‌సి కోసం ప్రయత్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన సన్నిహితుడన్న పేరు ఉంది. అయితే సిఎం పేర్లను ఖారారు చేసి దావోస్‌కు వెళ్లిన సమయంలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఉన్నాయని, రేవంత్ ప్రమేయం లేకుండానే మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఎంఎల్‌సి ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా ఉంటా : అద్దంకి దయాకర్
ఎంఎల్‌సి టికెట్ రేసులో చివరి నిమిషం వరకు పోటీ పడి నిరాశకు గురైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని ఎంఎల్‌సి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం సహనంగా ఉంటానని వెల్లడించారు. మరింత మంచి అవకాశం ఇవ్వటానికి పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నానని, నా విషయంలో కేంద్ర, రాష్ట్ర పార్టీలు సానుకూలంగా ఉన్నాయని అద్దంకి దయాకర్ వివరించారు. ఎంఎల్‌సి కంటే మంచి పదవి రావొచ్చని భావిస్తున్నానని, అప్పటి వరకు పార్టీ కోసం సహనంగా, విధేయతగా ఉంటానని వివరించారాయన. ఎంఎల్‌సి టికెట్ రాకపోవటంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మెద్దని, పార్టీకి ఎప్పుడూ విధేయతగా ఉంటానని అద్దంకి దయాకర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News