Monday, December 23, 2024

అఫ్గాన్తో ఉత్కంఠ మ్యాచ్.. రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అఫ్గానిస్థాన్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో, చివరి టి20లో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో పది పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ కూడా 16 పరుగులు చేయడంతో మరోసారి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో రెండో సూపర్ ఓవర్ ఆడించక తప్పలేదు.

ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గాన్ ఒక పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు విజయం దక్కింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

ఒక దశలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ అజేయ శతకంతో ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 69 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 121 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు చెలరేగి ఆడిన రింకు సింగ్ 39 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, రెండు బౌండరీలతో అజేయంగా 69 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (50) శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గుల్బదిన్ నైబ్ 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నబి (34) కూడా చెలరేగి ఆడడంతోఅఫ్గాన్ మ్యాచ్‌ను టైగా ముగించింది. ఆ తర్వాత ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చారు. ఇందులో భారత్ జయకేతనం ఎగుర వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News