వారికి దన్నుగా కొత్త మార్గాలపై ఆలోచించండి
మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రపతి హితవు
న్యూఢిల్లీ : ఇతర ఔత్సాహిక మహిళలను గుర్తించి, వారి సాధికారత ప్రస్థానంలో మద్దతుగా కొత్త మార్గాల గురించి ఆలోచించవలసిందిగా మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా స్వతంత్రం కావాలని కలలు కంటున్న మహిళలు అనేక మంది ఉన్నారని, కాని ఆ లక్ష సాధనకు ఏ మార్గం అనుసరిమాలో వారికి తెలియదని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖ స్టార్లప్‌లు, యూనికార్న్‌ల వ్యవస్థాపక, సహ వ్యవస్థాపక మహిళల బృందంతో ముర్ము సంభాషిస్తూ, వారి విజయం ఎంత ప్రభావం చూపాలంటే ‘అటువంటి విజయ గాథలను దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మనం వినగలగాలి’ అని సూచించారు.
ప్రతి మహిళ సాధికారురాలు కాగల, ప్రతి యువ మహిళ తన కలల సాఫల్యానికి దృఢవిశ్వాసంతో ముందుకు సాగగల భారతం నిర్మాణానికి సంఘటితంగా కృషి చేయాలని మనం సంకల్పించాలని రాష్ట్రపతి హితవు పలికారు. ‘ప్రజలతో రాష్ట్రపతి’ కార్యక్రమం కింద గురువారం సమావేశం చోటు చేసుకుంది. ఆ కార్యక్రమం లక్షం ప్రజలతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకుని, వారి సేవలను గుర్తించడం. కాగా, మహిళా పారిశ్రామికవేత్తలు భారతీయ వాణిజ్య వాతావరణాన్ని మార్చారని రాష్ట్రపతి ఆ సమావేశంలో చెప్పారు.