Friday, November 22, 2024

ఇండోర్ కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలిన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల విద్యార్థి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఇండోర్ లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సి) ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. యధాప్రకారం బుధవారం కోచింగ్ సెంటర్ క్లాస్‌కు వెళ్లాడు. పాఠం వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ముందున్న టేబిల్‌పై ఒరిగిపోయాడు. ఈ సంఘటన అంతా క్లాస్ రూమ్ సిసిటివి ఫుటేజీలో రికార్డయింది. బ్లాక్ షర్టు వేసుకున్న మాధవ్ తోటి విద్యార్థుల మధ్య కూర్చుని ఉండడం కనిపించింది. విద్యార్థులంతా భుజం భుజం ఆనించుకుని పెద్ద గదిలో కిక్కిరిసి ఉన్నారు.

32 సెకండ్ల పాటు కనిపించే ఈ సిసిటివి దృశ్యాల్లో మొదట మాధవ్ మామూలుగానే ఉన్నాడు. సరిగ్గా కూర్చుని పుస్తకాల్లో నిమగ్నమయ్యాడు. 10 నిమిషాల తరువాత ముందునున్న డెస్క్‌పై ఒరిగిపోయాడు. అతని పక్కనున్న విద్యార్థి మాధవ్ వీపుపై రుద్దడం ప్రారంభించాడు. ఇంకా మాధవ్ బాధతో ఉండడంతో స్నేహితుడు వెంటనే ఇన్‌స్ట్రక్టర్ దృష్టికి తెచ్చాడు. విద్యార్థులు సమీపాన గల ప్రైవేట్ ఆస్పత్రికి మాధవ్‌ను తరలించారు. అయితే కొంతసేపటికే మాధవ్ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో ఇండోర్ లోనే ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయని మీడియా కథనాలు వెల్లడించాయి. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే సంఘటనలు గత ఏడాది కూడా సంభవించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News